హైదరాబాద్: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన నాగ్‌పూర్ ప్రత్యేక బృందం సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అగ్ని ప్రమాదంలో సుమారు 1,100 కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని బృందం గుర్తించింది. ల్యాబ్‌లో ఉన్న మొత్తం రికార్డుల్లో సగానికి పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. దగ్ధమైన కేసుల డేటాను తిరిగి సాధించేందుకు ప్రత్యేక బృందం సాంకేతికంగా పలు ప్రయత్నాలు చేసినప్పటికీ, డేటా రికవరీ చాలా క్లిష్టమని తేల్చింది.
ముఖ్యంగా పాత కేసులకు సంబంధించిన భౌతిక ఫైళ్లు పూర్తిగా కాలిపోవడంతో వాటి పునరుద్ధరణ దాదాపు అసాధ్యమని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామం పలు కీలక విచారణలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫైళ్ల నష్టం వల్ల కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు ఆలస్యం కావచ్చని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణమా? లేక ఇతర అనుమానాస్పద కోణాలున్నాయా? అనే దిశగా విచారణ జరుగుతోంది. ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఫోరెన్సిక్ రికార్డుల భద్రత, డిజిటల్ బ్యాకప్ వ్యవస్థలపై మరోసారి చర్చ మొదలైంది.