హైదరాబాద్: చిలకలగూడలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మెట్టుగూడ డివిజన్ దూద్ బావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ఇంటిలోని ఒక భాగం కూలిపోగా, సమీపంలోని నివాస నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతుడు ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. అతని భార్య, పిల్లలకు గాయాలు అయ్యాయి.
పేలుడు గురించి తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిసరాల్లోని దాదాపు ఎనిమిది ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ, సిలిండర్ నుండి ఎల్‌పిజి గ్యాస్ లీకేజీ పేలుడుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.