డయల్–100కు అందిన సమాచారంపై క్షణాల్లో స్పందించిన మియాపూర్ పోలీసులు.. ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని అప్రమత్తతను చాటుకున్నారు. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతం, మార్థండనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద 04.01.2026 రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. సంఘటనా స్థలంలో చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడిని వి. కాటమయ్య (24)ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్‌పేట్ గ్రామం వాసిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల చాకచక్యంతో ఏటీఎం వద్ద పెద్ద నష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా డయల్–100కు వచ్చే ప్రతి సమాచారంపై తక్షణ చర్యలు తీసుకుంటామని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మియాపూర్ పోలీసులు ప్రజలను కోరారు.