ముఖ్యాంశాలు

  • అదుపు తప్పి ఫ్లైఓవర్‌ మీది నుంచి కిందపడ్డ కారు
  • మహిళ మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అతివేగం వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్‌ నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అదుపు తప్పిన కారు ఫ్లైఓవర్‌ పై మీద నుంచి.. అదే సమయంలో కింద ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. దీంతో ప్రమాదస్థలి వద్ద భారీ ట్రాఫిక్‌ అయ్యింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు.. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ TS09 ew 5659.

ఈ నెలలో ఫ్లైఓవర్‌ ఇది రెండ ఘటన. గతంలో ఫ్లైఓవర్‌పై సెల్ఫీతీసుకుంటుండగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కాగా ఘటనా స్థలాన్ని సీపీ సజ్జనార్‌ పరిశీలించారు. కారు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన నెలరోజుల్లోనే రెండు ప్రమాదాలు జరగడం గమనార్హం. వరుస ఘటనలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఫ్లైఓవర్‌పై 40 స్పీడ్‌ దాటకూడదు. కానీ నిత్య నీలన్‌ అనే వ్యక్తి వోక్స్‌ వ్యాగన్‌ కారులో 100 స్పీడ్‌లో వచ్చాడని పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్‌పై ఉన్న కార్నర్‌లో స్పీడ్‌ కంట్రోల్ అవకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సత్యవేణి అనే మహిళ చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ని ఇంజినీర్లతో మరోసారి పరిశీలించాలని పోలీసులు తెలిపారు.

గచ్చిబౌలిలో జరిగిన ప్రమాద ఘటనపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వేగాన్ని నియంత్రించేందుకు చేపట్టే చర్యల కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు మూడు రోజుల పాటు రాకపోకలను నిలిపివేశారు. ఫ్లైఓవర్‌ ప్రమాద ఘటనలో కూలిన చెట్లను, శిథిలాలను జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.