కొడుకును కనకపోవడం ఆమె తప్పా..? తలాక్ చెప్పాడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Nov 2019 4:57 PM ISTముఖ్యాంశాలు
- కొడుకును కని ఇవ్వలేదని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మోహ్‌రాజ్ బేగం
- అర్థం పర్థం లేని కారణాలతో ట్రిపుల్ తలాక్ చెబుతున్న కొందరు భర్తలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చినా.. ముస్లిం మహిళల కష్టాలు మాత్రం తీరడం లేదు. అర్థం లేని కారణాలు చెబుతూ భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలిపెడుతున్నారు. భార్యకు ఎత్తు పళ్లు ఉన్నాయంటూ పెళ్లయిన నాలుగు నెలల్లోనే భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. కొడుకును కని ఇవ్వలేదని ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో బాధిత భార్య మోహ్‌రాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కొడుకును కని ఇవ్వలేదని అందుకే నాకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తాను మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి యత్నిస్తున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పాతబస్తీకి చెందిన దస్తగిరి అనే యువకుడితో మెహ్‌రాజ్ బేగంకు 2011లో వివాహామైంది. అత్తమామలు కూడా కట్నకానుకలు భారీగానే ముట్టజెప్పారు. పెళ్లై మొదటి ఏడాదికే మోహ్‌రాజ్ బేగం గర్భం దాల్చింది. అయితే పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లకపోవడంతో కడుపులోనే ఆబిడ్డ చనిపోయింది. ఈ నేపథ్యంలో మరో గర్భవతి అయిన మోహ్‌రాజ్ బేగం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తనకు ఆడబిడ్డ వద్దని దస్తగిరి తన భార్యను ఇంట్లోనే వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్దలు వాళ్లిద్దరి మధ్య ఎన్నిసార్లు సయోధ్య కుదిర్చిన.. భర్త దస్తగిరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. రెండు సార్లు భరోసా సెంటర్ కూడా కౌన్సిలింగ్ తీసుకున్న ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి పెద్దల సమక్షంలో పంచాయతీలోనే మోహ్‌రాజ్ బేగంకు దస్తగిరి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కాగా బాధితురాలి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
చిన్న చిన్న కారణాలతోనే కొందరు భర్తలు భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పి మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఎక్కువ కట్నం తీసుకురావాలని, బిర్యానీ చేయలేదని, కూర బాగా వండలేదని, అందంగా లేవని.. ఇలా ఎన్నో కారణాలతో కొందరు భర్తలు భార్యలను వదిలించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్‌కు నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినా కొందరు భర్తలు మాత్రం మారలేకపోతున్నారు.
ముస్లిం మహిళ (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లు 2019 నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. ఈ చట్టంతో ముస్లిం మహిళలకు నిజంగా ఉపశమనం లభిస్తుందా అంటే.. లభించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ శిక్షార్హమైన చట్టం తీసుకువచ్చిన కొందరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. ఇప్పటికే చాలా దేశాలు ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే ట్రిపుల్ తలాక్ నిషేధించిన దేశాల సరసన భారత్ కూడా చేరింది.