ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో సర్వీసులు.. వారికి అనుమతి లేదు
By సుభాష్ Published on 7 Sep 2020 3:19 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఐదు నెలల తర్వాత హైదరాబాద్ మెట్రో సర్వీసు సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో మూడు దశల్లో మెట్రోను ప్రారంభించనున్నారు. మొదటి దశ సోమవారం నుంచి ప్రారంభమైన మెట్రో.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నడవనున్నాయి. దీనికి సంబంధించి మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మెట్రోలో ప్రయాణించే వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నారు. మాస్క్ లేకపోయినా.. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా.. మెట్రోలో అనుమతించరు.
ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అలాగే కంటైన్‌మెంట్ జోన్లలో మెట్రోకు అనుమతి లేదు. మరో వైపు భౌతిక దైరం విషయంలో మార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీటు సీటుకు మధ్య మార్కింగ్ ఉండనుంది. భౌతిక దూరం విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండేలా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేనున్నారు మెట్రో అధికారులు.
కాగా, అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర మెట్రో సేవలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు నడపనున్నారు. అలాగే స్మార్ట్ కార్డులు, నగదు రహిత విధానం ద్వారానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మెట్రో స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. అలాగే మెట్రో స్టేషన్‌లలో ఐసోలేషన్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అన్నారు.