ఈనెల 12నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..!

By సుభాష్  Published on  7 Sep 2020 1:42 AM GMT
ఈనెల 12నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..!

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పలు రైళ్లు ఈనెల 12వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్దరణలో భాగంగా 12వ తేదీ నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అందుకు సంబంధించిన రిజర్వేషన్లు ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రూట్ల వారీగా రైళ్ల వివరాలను రైల్వేబోర్డు ఆయా జోన్ల జనరల్‌ మేనేజర్లకు పంపింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన తర్వాత మొదట వలస కార్మికుల కోసం శ్రామిక రైళ్లను నడిపింది రైల్వేశాఖ.

ఇక ప్రయాణికులకు మే 12 నుంచి 30 ఏసీ రైళ్లు, జూన్‌ 1 నుంచి 200 సాధారణ రైళ్లు కలిపి మొత్తం 230 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అన్‌లాక్‌ నేపథ్యంలో ప్రజల రాకపోకలు మరింత పెరగడంతో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది రైళ్లే శాఖ. ఈ మేరకు 80 రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా, ప్రత్యేక రైళ్లలో దక్షిణ మధ్య రైల్వో జోన్‌కు, దాని పరిధిలోని తెలుగు రాష్ట్రాలకు దక్కింది నామ మాత్రంగానే. హైదరాబాద్‌కు నాలుగు రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్‌-దర్బంగా,దర్బంగా -సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - పర్బని, పర్బని-సికింద్రాబాద్‌ ఉన్నాయి. ఇక బీహార్‌, మహారాష్ట్రలకు వెళ్లేవారికి వీటితో ప్రయోజనం ఉంటుంది. సికింద్రాబాద్‌-విజయవాడల మధ్య కానీ, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఒక్క రైలు కూడా ప్రకటించలేదు.

ప్రత్యేక రైళ్ల ప్రకటనలో తమిళనాడుకు రైల్వేబోర్డు పెద్దపీట వేసింది. ఆ రాష్ట్రం పరిధిలో రాకపోకలు సాగించేవారి కోసం ఏకంగా 13 ప్రత్యేక రైళ్లను రైల్వేబోర్డు ప్రకటించింది. సదరు రైళ్లన్నీ పూర్తిగా ఆ రాష్ట్రం పరిధిలోనే తిరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి ప్రారంభమయ్యే కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. అయితే రిజర్వేషన్‌ కోటా నామ మాత్రంగా ఉండే వాటితో ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు.

Next Story