హైదరాబాద్ లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ మనసులో ఏముంది..?
By సుభాష్ Published on 2 July 2020 6:38 AM GMTరోజురోజుకీ పెరుగుతున్న మహమ్మారి కేసులు తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజులో వంద కేసులు నమోదైన పరిస్థితితో హడలిపోయిన పరిస్థితి నుంచి తాజాగా రోజులో వెయ్యి కేసుల్ని దాటేసిన పరిస్థితి చూస్తే.. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో లాక్ డౌన్ ను విధించటం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు.
మిగిలిన వారి మాదిరి లాక్ డౌన్ విధించటంతోనే సమస్యలు పరిష్కారం కావన్న యోచనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండో రోజూ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారిలో పలువురు లాక్ డౌన్ విధించటం మినహా మరో మార్గం లేదని చెబితే.. ఇంకొందరు మాత్రం రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తే ఆర్థికంగా నష్టాలు తప్పవని చెప్పుకొచ్చారు. అదే జరిగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న వాదనను వినిపించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో లాక్ డౌన్ శాశ్విత పరిష్కారం ఎంత మేరకు కాదని.. వీలైనంతవరకువైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట చెప్పేందుకు వీలుగా అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించటం మంచిదన్న మాట వినిపిస్తోంది.
లాక్ డౌన్ స్థానే.. వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటంతో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రాకూడదన్న అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటం ద్వారా కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు.
మొన్నటి లాక్ డౌన్ కారణంగా స్తంభించిన కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వేళ.. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ విధిస్తే మొదటికే మోసం వస్తుందని.. ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోతుందన్న వాదనల్ని కేసీఆర్ ముందు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో.. లాక్ డౌన్ విధించే విషయంలో కేసీఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి అందరి అభిప్రాయాల్ని సేకరించటంతో పాటు.. అధికారుల సూచనల్ని పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయాన్ని ప్రకటించే వీలుందని చెబుతున్నారు.