డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌

By సుభాష్  Published on  21 July 2020 10:37 AM IST
డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. ఇక భాగ్యనగరంలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. హైదరాబాద్‌ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారిపోయింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు,పుణే నగరాల్లో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గినా.. తాజాగా హైదరాబాద్‌, బెంగళూరులలో వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. అరంభంలో కరోనా పరీక్షల గురించి పెద్దగా పట్టించుకోని తెలంగాణ సర్కార్.. ఇప్పుడు పరీక్షల మీద ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే 2 లక్షల ర్యాపిడ్‌ యాంటీజెస్‌ పరీక్ష కిట్లను తెప్పించిన ప్రభుత్వం.. మరో 5 లక్షల యాంటీజెస్‌ పరీక్షలు చేయాలని భావిస్తోంది. అయితే సీఎంఆర్‌ అనుమతి పొందిన సంస్థ దగ్గర నుంచి ర్యాపిడ్‌ కిట్లను కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేశారు. కానీ జిల్లాల్లోనూ కేసుల సంఖ్య వేగంగానే పెరుగుతోంది. ఇక ర్యాపిడ్‌ కిట్లను కూడా జిల్లాలకు పంపించనున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైరిస్క్‌ జోన్లుగా కేటాయించింది ప్రభుత్వం. చార్మినార్‌, రాజేంద్రనగర్‌, యూసుఫ్‌ గూడ, మెహిదీపట్నం, కార్వాన్‌, అంబర్‌పేట, చంద్రాయణగుట్ట, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో దాదాపు500లపైగా కరోనా కేసులు ఉండటంతో వాటిని హై రిస్క్ జోన్లుగా ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం.

ఇతర జిల్లాలకంటే హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికంగా కేసులు నమోదు అవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎలాంటి మార్గం లేదు. నగరంలో బయటకు వస్తున్న కొందరు మాస్క్‌ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డేంజర్‌ జోన్‌లో ఉన్న రాష్ట్రం.. మున్ముందు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక తాజాగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 50వేలకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 11,003 మందికి పరీక్షలు చేయగా, అందులో 1198 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా ఏడుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 422కు చేరుకుంది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 34,323 మంది కరోనా నుంచి కోలుకుని, ప్రస్తుతం 11,530 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 1885 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇలా రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతుండటంతో నగర వాసుల్లో మరింత భయాందోళన నెలకొంది. ఎవరికి ఎప్పుడు వైరస్‌ వ్యాప్తిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందే వ్యాక్సిన్‌ లేని కారణంగా బయటకు వచ్చేందుకు కొందరు జంకుతుంటే, మరి కొందరి నిర్లక్ష్యం కారణంగా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిపోతోంది.

Next Story