సర్వోన్నత న్యాయస్థానానికి చేరిన నిందితుల ఎన్‌కౌంటర్ కేసు
By Newsmeter.Network Published on 7 Dec 2019 1:35 PM ISTదేశవ్యాప్తంగా 'దిశ' ఘటన సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విచారణలో భాగంగా నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారుపోలీసులు. ఇంత సంచలనంగా మారిన ఎన్‌కౌంటర్ వ్యవహారం తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు పిటిషన్‌లో కోరారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం చటాన్‌పల్లిలో ఘటనాస్థలాన్ని పరిశీలించి నివేదిక అందించనుంది. నిన్న నిందితుల మృతదేహాలకు సంఘటన స్థలంలోనే ఫోరెన్సి నిపుణుల నేతృత్వంలో పంచనామా నిర్వహించారు.
హైకోర్టు ఆదేశాలతో నిందితుల అంత్యక్రియలకు బ్రేక్:
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, దిశ నిందితుల అంత్యక్రియలకు సంబంధించి నిన్న సాయంత్రం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 9వ తేదీ వరకు నలుగురి మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని మహిళా సంఘాలు హైకోర్టుకు లేఖ రాశాయి. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై స్పందించిన హైకోర్టు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసును 9వ తేదీన విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. దీంతో కోర్టు ఆదేశాలతో నిందితుల మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించడం ఆగిపోయింది. అప్పటికే నిందితుల కుటుంబీకులు అంత్యక్రియాలకు పూర్తి ఏర్పాట్లు చేసుకోగా, కోర్టు ఆదేశంతో అంత్యక్రియలకు బ్రేక్ పడింది.
మరోవైపు ఈ నలుగురు నిందితులను నకిలీ హత్య చేశారని, ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబైకి చెంది న్యాయవాది గురునాథ సదావర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. జాతీయ మానవహక్కుల కమిషన్, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ డీజీపీకు కూడా లేఖ రాశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపర్చాలని ఆదేశించడంతో , అక్కడ భద్రపర్చేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో మృతదేహాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీసు శాఖ