హైదరాబాద్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనాలు..!
By సుభాష్
ఒక వైపు భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుంటే మరో వైపు భూకంపం తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే అల్పపీడనం కారణంగా వరదలతో నగరమంతా జలదిగ్బంధంలో ఉంటే.. తాజాగా సంభవించిన భూ ప్రకంపనల కారణంగా ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు నగరంలో భూకంపం చోటు చేసుకోగా, మళ్లీ భారీ శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్దాలతో కూడిన భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గచ్చిబౌలి టీఎన్‌జీఓస్ కాలనీతో పాటు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో రాత్రి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి మొదలైన బుధవారం తెల్లవారుజాము వరకు పలు మార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి 2 గంటల నుంచి గంటకోసారి భారీ శబ్దాలతో భూమి కంపించినట్లు వారు తెలిపారు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఉప కమిషనర్ వెంకన్న ఘటన స్థలానికి చేరుకుని కాలనీ వాసులతో మాట్లాడారు. డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతామని, నిపుణులతో మాట్లాడి తెలుసుకుంటానని అన్నారు.