తెలంగాణ కోవిద్ కేసుల్లో 77 శాతం హైదరాబాద్ లోనివే..!
By సుభాష్ Published on 3 July 2020 6:28 AM GMTతెలంగాణ లో కరోనా కేసులు మరింత విజృంభిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ ను విధించాలని భావిస్తోంది. 1000 కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ నమోదవుతూ ఉండడంతో అధికారుల్లో టెన్షన్ పెరుగుతూ ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతూ ఉన్న కరోనా కేసులు చూసుకుంటూ ఉంటే 77 శాతం కరోనా కేసులు గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లోనే నమోదయ్యాయి. 18,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 14476 కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో నమోదయ్యాయి. ప్రతి 1000 కరోనా కేసుల్లో 900 కేసులు జిహెచ్ఎంసి పరిధిలో లేదా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1170 కరోనా కేసులు, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో 657 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల అధికారులు కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. సెంట్రల్ కు చెందిన ఓ టీమ్ కూడా నగరంలో పెరుగుతున్న కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని కోరడమే కాకుండా ట్రీట్మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా పెంచాలని కోరారు.
హెచ్.ఎం.డి.ఏ. పరిధిలోని సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, జనగాం ప్రాంతాలు నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డిలో 150 కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు నమోదయిన జిల్లాల్లో నాలుగో స్థానంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో 87 కేసులు, నల్గొండ 90, జనగాం 81 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నాయి. సూర్యాపేట్ జిల్లాలో 97, నిజామాబాద్ 94, వరంగల్ అర్బన్ 128 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ నారాయణపేట్ జిల్లాలో కేవలం 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో చెరో ఆరు కేసులు నమోదయ్యాయి. భూపాల పల్లి జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో హరిత హారం ప్రోగ్రామ్స్ కారణంగా కూడా కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం.. కనీసం సామాజిక దూరం పాటించకపోవడం కారణంగా పెద్ద సంఖ్యలో కరోనా సోకే అవకాశం ఉందని అంటున్నారు.