నేటి నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు
By సుభాష్ Published on 23 May 2020 9:02 AM ISTతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణలో కొనసాగుతున్న లాక్‌డౌన్ నుంచి ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నా.. ఉద్యోగులు వెళ్లేందుకు రవాణాసౌకర్యం లేక ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో బస్సులు నడిపేందుకు అంగీకరించింది. శనివారం నుంచి నగరంలో సిటీ బస్సులు నడవనున్నాయి.
అయితే బస్సులు మాత్రం అందరికి కాదు.. కేవలం హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రమే. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయాలకు వచ్చేవారికి బస్సు సౌకర్యం కల్పించారు. నగరంలో మొత్తం 32 మార్గాల్లో ఈ బస్సులు నడవనున్నాయి. బస్సుల్లో ఎక్కే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఎక్కాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా బస్సులు నడిపేందుకు అంగీకరించినందుకు టీఎన్జీవో ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
గత ఐదు రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సిటీలో ప్రత్యేక బస్సులను నడపాలని వారు కోరరారు. దీంతో ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు.