గుడ్‌న్యూస్‌: సినిమా షూటింగ్‌లకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

By సుభాష్  Published on  22 May 2020 1:56 PM GMT
గుడ్‌న్యూస్‌: సినిమా షూటింగ్‌లకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణలో సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ వినిపించారు. సినిమా షూటింగ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్‌ పనులకు అనుమతి ఇస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు. శుక్రవారం మధ్యాహ్న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, జెమిని కిరణ్‌, కొరటాల శివ తదితర సిని ప్రముఖులు కలిసి మాట్లాడారు. లాక్‌డౌన్‌ వల్ల సినీ ఇండస్రీ ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరించారు.

సినీ ఇండస్ట్రీపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారని వారు కేసీఆర్‌కు వివరించారు. సినిమా షూటింగ్‌లకు, సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని వారు సీఎంను కోరారు. ఈ విషయంపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. జూన్‌ మొదటి వారం నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులతో పాటు షూటింగ్స్‌ కూడా జరుపుకోవచ్చని కేసీఆర్‌ తెలిపారు.

కానీ కరోనా నిబంధనలకు లోబడి మాత్రమే షూటింగ్‌ లు జరుపుకోవాలని , అక్కడేం జరిగినా సినీ నిర్మాత బాధ్యత తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగా షూటింగ్‌లు నిర్వహించుకోవాలని, తర్వాత సినిమా థియేటర్ల ఓపెనింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ తెలిపారు. సినిమా షూటింగ్‌లు ఎలా నిర్వహించుకోవాలో విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు.

అయితే వీలైనంత తక్కువ మందితో షూటింగ్‌లు జరుపుకోవాలని, లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఇక షూటింగ్‌లకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story