హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
By అంజి
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పోటా పోటీ ర్యాలీలు చేపట్టాయి. ఒక పక్క వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించగా.. ఇంకోపక్క సీఏఏకు మద్దుతుగా ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల ర్యాలీలతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
సీఏఏకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థులు నినాదాలు చేశారు. జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో నిరసన చేపట్టారు. దీంతో యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు రగులుతూనే ఉన్నాయి. సీఏఏను వెనక్కు తీసుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని జామియాతో పాటు పలు యూనివర్సిటీల్లో పెద్ద హింసాత్మక ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు.
నగరంలోని చౌమహల్లా ప్యాలెస్ పక్కన ఉన్న ఖిల్వత్ గ్రౌండ్‌లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టిక, జాతీయ పౌరపట్టికలకు వ్యతిరేకంగా శనివారం రాత్రి ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇతర మజ్లీస్, ముస్లిం జేఏసీ నేతలు పాల్గొన్నారు.