హైదరాబాద్‌లో కరోనా అలజడి.. రెట్టింపవుతున్న కంటైన్‌మెంట్‌ జోన్లు..!

By సుభాష్  Published on  17 May 2020 3:37 PM IST
హైదరాబాద్‌లో కరోనా అలజడి.. రెట్టింపవుతున్న కంటైన్‌మెంట్‌ జోన్లు..!

దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్‌ ఇక హైదరాబాద్‌లో విజృంభిస్తోంది. గ్రేటర్‌ కంటైన్మెంట్‌ జోన్‌ల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్‌లో కరోనా కోరలు చాస్తుండటంతో కంటైన్మెంట్‌ జోన్‌ల సంఖ్య రెట్టింపవుతోంది. వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. మళ్లీ అమాంతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని జిల్లాల్లో ఏ ఒక్క కేసు కూడా నమోదు కాకున్నా గ్రేటర్‌లో మాత్రం విజృంభిస్తోంది. తాజాగా కేసులను చూస్తుంటే హైదరాబాద్‌ ప్రజలకు ఆందోళన మొదలైంది.

పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 60కిపైగా కంటైన్మెంట్‌ జోన్‌లు ఉన్నాయి. వీటిలో శనివారం నాటికి ఎల్బీనగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలోనే 50కిపైగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ వ్యక్తిగత నివాసాల్లో ఉండేవారికే కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో వారి నివాసాలను కంటైన్మెంట్‌ చేసేశారు.

అపార్ట్‌మెంట్‌ వాసుల్లోనే కరోనా..

కాగా, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ బర్త్‌డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్‌ తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. మాదన్నపేటలోని అపార్ట్‌ మెంట్‌లో ఓ బర్త్‌డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. ఆ పుట్టిన రోజు వేడుకకు హాజరైన మొత్తం 23 మందికి కరోనా తేలినట్లు అధికారులు తేల్చారు. ఈ కారణంగా ఆ ఆపార్ట్‌మెంట్‌లో 50 నుంచి 100 కుటుంబాలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది.

అంతేకాదు గడ్డిఅన్నారం తిరుమలానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి ద్వారా అదే అపార్ట్‌మెంట్‌లో 9 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో అధికారులు ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాందరినీ క్వారంటైన్‌కు తరలించారు. దీంతో ఇలాంటి అపార్ట్‌మెంటులన్నీ కంటైన్మెంట్‌ గా ప్రకటించారు. ఇక మోతీనగర్‌ డివిజన్‌లో ఒకటి, అల్వాల్‌ కాణాజిగూడలో మరొకరికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

మూడు సెంటర్లలో 26 కరోనా పాజిటివ్‌ కేసులు

కాగా, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల్లో 11 మందికి నెగిటివ్‌ రిపోర్టు రావడంతో శనివారం వారిని డిశ్చార్జ్‌ చేశారు. తాజాగా ఐదు అనుమానిత కేసులు నమోదు కాగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.

ఆయుర్వేద ఆస్పత్రిలో 120 మందికి వరకు ఉండగా, వీరిలో 20 మంది వరకూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రిపోర్టులో నెగిటివ్‌ వచ్చిన 60 మందిని డిశ్చార్జ్‌ చేయగా, మరి కొందరి రిపోర్టు రావాల్సి ఉంది. వీరిలో ఎంత మందికి పాజిటివ్‌ వస్తుందోనని ఆందోళన నెలకొంది.

కింగ్‌ కోఠి ఆస్పత్రిలో 75 మంది ఓపికి రాగా, అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ తేలింది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో తాజాగా మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.

జియాగూడ పరిధిలో 88 పాజిటివ్ కేసులు

అలాగే జియాగూడ పరిధిలోని సబ్జిమండి, మేకల మండిలోఉన్నవారు కొందరు ఇటీవల మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు 11 మంది ఉన్నారు. జియాగూడ పరిధిలో ఇప్పటి వరకూ 88 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 మంది మృతి చెందారు. ఇక ఖైరతాబాద్‌ పరిధిలో 20 కంటోన్మెంట్ జోన్లుండగా, వీటిలో ఒక్క జియాగూడ డివిజన్‌లో 8 కంటోన్మెంట్‌ జోన్లు ఉండటం గమనార్హం.

ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలో ఇప్పటి వరకూ 57కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో 13 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌లుగా ఏర్పాటు చేశారు. మలక్‌పేట్‌ గంజ్‌, పండ్ల మార్కెట్‌, కూరగాయల మార్కెట్లతో పాటు మలక్‌పేటలోని ఓ డయాలసిస్‌ కేంద్రం ద్వారా వైరస్‌ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఏరియాలో ముగ్గురు మృతి చెందారు.

ఇక అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌లో ఇప్పటి వరకూ 13 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. మిగిలిన వారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్లో..

ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒకే ఇంట్లో ఏడురికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న మీర్‌పేట కు చెందిన ఓ మహిళ ద్వారా అమె భర్తకు, ఇద్దరు కుమారులకు, న్యూవివేక్‌నగర్‌లో ఉండే ఆమె కుమార్తె, అల్లుడికి, తొమ్మిదేళ్ల మనవడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో న్యూవివేక్‌నగర్‌లోని సుమారు 100 మంది కుటుంబాలను కంటైన్‌మెంట్ పరిధిలోకి తీసుకువచ్చారు అధికారులు.

ఆసిఫ్‌నగర్‌లో పరిధిలలో 67 పాజిటివ్ కేసులు

ఇక ఆసిఫ్‌నగర్‌లో శనివారం మరో పది మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. న్యూకిషన్‌ నగరర్‌లో పది రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్‌కు వైరస్‌ సోకగా, అతని ద్వారా కుటుంబ సభ్యులకు కూడా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆసిఫ్‌నగర్ పరిధిలో ఇప్పటి వరకూ 67 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఇందులో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక గోషామహల్‌లో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కామటిపురాలో ఒకే భవనంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇలా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటంతో అధికారులను సైతం ఆందోళన కలిగిస్తోంది.

Next Story