హుజూర్‌ నగర్‌లో గులాబీ కారు దూసుకు పోయింది. హుజూర్‌ నగర్ లో గులాబీ జెండా ఎగరాలనే కల టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెరవేరింది. దీని వెనుక దశాబ్దం కృషి ఉంది అంటున్నారు గులాబీ నేతలు. హుజూర్ నగర్‌ అంటేనే కాంగ్రెస్ కంచుకోటగా పేరుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి పెట్టని కోట. అయినా..అక్కడ గెలవాలని టీఆర్‌ఎస్‌ చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికల్లో కోదాడలో గెలిచిన టీఆర్‌ఎస్ హూజుర్‌ నగర్‌ను మాత్రం కోల్పోయింది. అయితే..లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికవ్వడంతో ..హూజుర్ నగర్ సీటు ఖాళీ అయింది.

నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కూడా పోటీ చేయడానికి ముందుకు రాలేదు. చివరకు ఉత్తమ్ కుమార్ సతీమణి పద్మావతి రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించింది. ప్రచారంలోనే కాంగ్రెస్ కాడే వదిలేసినట్లు కనిపించింది. అయితే..ప్రచారం చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వారితో రోడ్ షో కూడా చేయించారు. అయినా..అంచనాలకు మించి టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైది రెడ్డి  భారీ విజయం దక్కించుకున్నారు.

ఒక పక్క ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. మరోపక్క అసంతృప్తి ఉందంటున్నారు..అయినా టీఆర్‌ఎస్ భారీ గెలుపుకు కారణం ఏంటీ..?

హుజూర్ నగర్‌ సీటు ఖాళీ అయినప్పటి నుంచే టీఆర్‌ఎస్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తమ అభ్యర్ధి సైదిరెడ్డినే రంగంలోకి దించింది. సైదిరెడ్డి రెండు సార్లు ఓడిపోయి ఉండటంతో సానుభూతి ఉంటుందని టీఆర్‌ఎస్‌ లెక్కలు వేసుకుంది. అంతేకాదు..టీఆర్‌ఎస్ ను గెలిపిస్తే..భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని టీఆర్‌ఎస్‌ ప్రచారంలో వాగ్దానం చేసింది. ఓటర్లు కూడా ఒక్కటి ఆలోచించారు. రాష్ట్రంలో , కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి ఉండదని అనుకున్నారు. తమ పనులు కూడా కావాని ఓటర్లు భావించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే అభివృద్ది జరుగుతుందని ఓటర్లు ఆలోచించారు. అంతేకాదు.. రెండు సార్లు ఓడిపోయిన తరువాత కూడా సైదిరెడ్డి..ప్రజలతో సంబంధాలు తెంచుకోలేదు. ప్రజలతో సఖ్యతగా ఉంటూ..వారికి కావాల్సిన పనులు చేపట్టారు. తన దగ్గరకు వచ్చినవారికి సహాయం చేశారు. ఇవన్నీ కూడా ఉప ఎన్నికల్లో సైదిరెడ్డికి కలిసి వచ్చాయి.

ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రభుత్వం మీద వ్యతిరేక ఉంది తమకు కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్‌కు చేదు వార్త మిగిల్చింది హుజూర్‌ నగర్‌. ఉప ఎన్నికల్లో గెలుపు ..రాష్ట్రం మొత్తం ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయకపోయినప్పటికీ…హుజూర్‌ నగర్‌ లో ప్రత్యేక పరిస్థితులు గులాబీ సేనను గెలిపించాయని చెప్పొచ్చు. ఇక..టీడీపీ, బీజేపీల పరిస్థితి ఘోరంగా ఉంది.హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక గెలుపు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పెద్ద బూస్టేనని చెప్పాలి.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.