వంద దేశాల్లో కరోనా

By సుభాష్  Published on  10 March 2020 1:55 PM GMT
వంద దేశాల్లో కరోనా

ఇందుగలదు అందు లేదని సందేహము వలదు. ఇదేదో శ్రీహరి గురించి ప్రహ్లాదుడు చెప్పిన పద్యం మాత్రమే అనుకోకండి.. ఇప్పుడు కరోనా కూడా అంతే ఎందెందు వెతికి చూసిన అందందే గలదు. ఎందుకంటే కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేలకి చేరింది. ఇక లక్షన్నరకు పైగా కరోనా బాధితులు ఉన్నారు. 100 దేశాలకు ఈ వైరస్ పాకి విలవిలలాడిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మాల్దీవులు, ఫరోదీవులు, బల్గేరియా వంటి ఎనిమిది దేశాలను కరోనా వైరస్‌ పాకిందని డబ్ల్యుహెచ్ఓ ట్వీట్‌ చేసింది. దీంతో ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తం అయ్యాయి. కరోనాను నియంత్రించేందుకు తగు చర్యలకు సిద్ధం అవుతున్నాయి.

కోవిడ్ -19 ఇరాన్‌ను కలవర పెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి ఆ దేశంలో తాజాగా మరో 43 మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 237కి చేరింది. మరో 7వేల మందికి పైగా ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరానియన్‌ జ్యుడీషియరీ చీఫ్‌ ఇబ్రహీం రైసీ వెల్లడించినట్టు మిజాన్‌ అనే ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

అటు చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 40 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇంత తక్కువ మంది వైరస్‌ బారిన పడడం ఇదే తొలిసారి. దీంతో బాధితుల సంఖ్య 80,700కు తాకింది. మరణాల సంఖ్య 3,119కి చేరింది.

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ఇప్పుడు ఇటలీని వణికిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య అక్కడ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దాదాపు 1.5 కోట్ల మంది నిర్బంధంలో ఉన్నారు. ఇక వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న లాంబర్డీ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పర్యాటక స్థలాలు బోసిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు ఆదేశించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే మూడు నెలల పాటు జైలు శిక్ష లేదా 206 యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇక్కడ మృతుల సంఖ్య 366కు చేరింది. మొత్తం 7,375 మంది వైరస్‌ బాధితులుగా మారారు.

Next Story