కరోనా హాట్ స్పాట్లు గా మారిన జిల్లాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 9:41 AM GMT
కరోనా హాట్ స్పాట్లు గా మారిన జిల్లాలు..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలను కలవరపెడుతున్న విషయం ఏమిటంటే.. ఇప్పుడు మహా నగరాలతో పోలిస్తే జిల్లాల్లో కరోనా కేసులు అధికమవుతూ ఉన్నాయని తాజా లెక్కల ద్వారా స్పష్టంగా వెల్లడవుతోంది.

ఆదివారం నాటికి అందిన సమాచారం ప్రకారం దేశంలోని సగానికి పైగా జిల్లాలలో 500 కంటే ఎక్కువ కోవిద్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 190 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదయ్యాయి. 140 జిల్లాల్లో 500 నుండి 1000 మధ్య కేసులు నమోదవ్వగా.. 101-500 మధ్య కేసులు 247 జిల్లాల్లో నమోదయ్యాయి. 10 నుండి వంద లోపు కోవిద్ కేసులు 67 జిల్లాల్లో నమోదయ్యాయి. 22 జిల్లాల్లో మాత్రమే 10 కేసుల కంటే తక్కువ నమోదయ్యాయి.

78 శాతం జిల్లాల్లో కోవిద్-19 కారణంగా మరణించారని తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఆరు జిల్లాల్లో 1000కి పైగా కోవిద్-19 మరణాలు సంభవించాయి. మరణాలు లేని జిల్లాలు 154 వరకూ ఉన్నాయి. 1-10 మరణాలు 322 జిల్లాల్లో సంభవించాయి. 11-50 వరకూ మరణాలు 139 జిల్లాల్లో నమోదయ్యాయి. 51 నుండి 100 మరణాలు 37 జిల్లాలు చూశాయి. 100కు పైగా మరణాలు 28 జిల్లాల్లో సంభవించాయి.

ఒకప్పుడు హాట్ స్పాట్ గా ఉన్న ప్రాంతాలలో చాలా వరకూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ లలో భారీగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత రెండు వారాలుగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిందని చెబుతున్నారు అధికారులు.

ప్రస్తుతం 11 జిల్లాలు అధికారులను కలవరానికి గురిచేస్తూ ఉన్నాయి. కేసుల సంఖ్య ఈ రాష్ట్రాల్లో 10 శాతం కంటే అధికంగా ఉంది. గత రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని అయిదు జిల్లాల్లో గ్రోత్ రేట్ అధికంగా ఉంది. తూర్పు గోదావరి, విజయనగరం, పశ్చిమ గోదావరి, విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా వృద్ధి రేటు అధికంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరు రూరల్, బెళగావి జిల్లాల్లోనూ కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతోంది. కేరళ, బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్రలోని ఒక్కో జిల్లాలో కరోనా వృద్ధి రేటు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది.

ఆయా రాష్ట్రాలలోని జిల్లాల్లో ఒక్కో ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఒక్కో దశలో ఉందని స్పష్టమవుతోంది. ఒకప్పుడు హాట్ స్పాట్ గా ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఆంక్షలు కరోనాను కట్టడి చేస్తూ ఉంటే.. ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్న జిల్లాల్లో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంక్షలు విధిస్తున్న జిల్లాల్లో అధికారులు వీలైనంత కఠిన నియమాలను అమలు చేస్తూ ఉండడంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలుతున్నారు.

Next Story
Share it