రూపాయికే చికెన్‌ బిర్యానీ.. కొనేందుకు ఎగబడ్డ జనం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2020 1:35 PM IST
రూపాయికే చికెన్‌ బిర్యానీ.. కొనేందుకు ఎగబడ్డ జనం..

కరోనా పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఇది ఎలా వ్యాపిస్తుంది అన్నది పక్కన బెడితే.. చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న వార్తలు హల్‌చల్‌ చేయడంతో.. ప్రజలు చికెన్‌ తినేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో చికెన్‌ విక్రయదారులు దారుణంగా నష్టపోతున్నారు. చికెన్‌ తింటే కరోనా రాదు అని అధికారులు ఎంత చెబుతున్నా.. చికెన్‌ కొనేందుకు జనాలు జంకుతున్నారు. ఫలితంగా చికెన్ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్న వ్యాపారులు ఉన్నకాడికి అమ్ముకుందామని ధరలను దారుణంగా తగ్గించి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులోని తిరువళ్లూరులో జిల్లా పొన్నేరీ ప్రజలు మాత్రం కాసేపు కరోనా భయాన్ని పక్కన పెట్టి.. అందినంత చికెన్‌ బిర్యానీ ఆరంగించారు. పొన్నేరిలో కొత్తగా బిర్యానీ సెంటర్ ను ప్రారంభించారు. అంతేకాదు ప్రజలను ఆకట్టుకునేందుకు ఓ ఆఫర్ ను పెట్టారు. అదే రూపాయికి చికెన్ బిర్యానీ. ఇంకేముంది.. నాన్‌ వెజ్‌ ప్రియులు హోటల్‌ ముందు క్యూ కట్టారు. ఎంతలా అంటే పోలీసులు వచ్చి జనాలను అదుపు చేసి క్యూలో పంపించారు.

మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది. హోటల్‌ యజమాని మాట్లాడుతూ... కొత్తగా హోటల్‌ ప్రారంభించామని, కరోనా వైరస్‌ భయంతో చికెన్‌ బిర్యానీ విక్రయమవుతుందా అనే సందేహం కలిగిందన్నారు. దీంతో రూ.1కే అని ప్రకటించిన రెండు గంటల్లోనే బిర్యానీ విక్రయమైందన్నారు. వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడం తమకు సంతోషాన్నిచ్చిందన్నారు.

Next Story