ఎలా చేసినా సెంచరీ సెంచరీనే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Dec 2019 4:53 PM IST
టీమ్‌ఇండియా ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురువారం తన సొంత అకాడమీలో యువ ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ పలు సూచనలు చేశాడు. ఆటగాడిగా ఎదిగే క్రమంలో షాట్ల ఎంపికలో పరిణితి సాధించడం కంటే.. అంతిమ ఫలితమే ముఖ్యమని 'హిట్‌మ్యాన్' తన అకాడమీ కుర్రాళ్లతో అన్నాడు.
భారీ షాట్లు ఆడటం ప్రమాదమేమీ కాదని.. ఆటగాడిగా ఎదుగుతున్న క్రమంలో బంతిని గాల్లోకి లేపడం నేరం కానే కాదని తెలిపాడు. కాకపోతే నెట్స్‌లో అలాంటి షాట్లపై నియంత్రణ సాధించాలని సూచించాడు. మీరు ఆడే భారీ షాట్ల కారణంగా మ్యాచ్ మీ వైపు మొగ్గు మల్లితే సంతోషమేనని.. కానీ ఆ షాట్లకు ప్రయత్నిస్తూ పదే పదే అవుటవడం మాత్రం మూర్ఖత్వం అవుతుందని రోహిత్ శర్మ అన్నాడు.
అలాగే.. మీరు సెంచరీ చేసేందుకు 50 బంతులు ఆడారా.. లేదా రెండొందల బంతులు తీసుకున్నారా అనేది ముఖ్యం కాదు. ఎలా చేసినా సెంచరీ సెంచరీనే. దాని విలువ మారదని రోహిత్ అన్నాడు. ఇక, అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగనున్న టీమిండియా-19 జట్టు మరోసారి విజేతగా నిలుస్తుందని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.