తమదే ఆ స్థలం అనుకొని.. పక్క దేశంలో కోట కట్టిన అమెరికా

Fort Blunder.. The Fort That America Mistakenly Built in Canada. అమెరికా చేసిన ఓ తప్పు చరిత్రలో నిలిచిపోయింది. కొన్ని వందల ఏళ్ల కిందట కెనడా నుంచి మాటిమాటికి అమెరికాలోకి

By అంజి  Published on  27 July 2022 7:18 AM GMT
తమదే ఆ స్థలం అనుకొని.. పక్క దేశంలో కోట కట్టిన అమెరికా

అమెరికా చేసిన ఓ తప్పు చరిత్రలో నిలిచిపోయింది. కొన్ని వందల ఏళ్ల కిందట కెనడా నుంచి మాటిమాటికి అమెరికాలోకి చొరబడేందుకు బ్రిటీష్ సైన్యం ప్రయత్నించింది. వారిని ఎలాగైనా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్న అమెరికా.. ఒక కోటను కట్టాలని భావించింది. అంతే తడవుగా కట్టుదిట్టమైన రక్షణతో భారీ కోట నిర్మాణం చేపట్టింది. అయితే కోట నిర్మాణం చివరి దశలో అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. అమెరికా అధికారులు అంత కష్టపడి కట్టిన కోట అమెరికాలో కాకుండా.. బ్రిటీష్ సైన్యం ఆధీనంలో ఉన్న కెనడాలో ఉందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అమెరికా అధికారులు నాలుక కర్చుకున్నారు. నెమ్మదిగా నిర్మాణ పనులు ఆపేసి అక్కడి నుంచి జారుకున్నారు. 18వ శతాబ్దంలో జరిగిన ఈ పొరపాటు చరిత్రలో నిలిచిపోయింది.

అసలు ఏమైందంటే?

ప్రపంచంలో చాలా దేశాలను బ్రిటీష్ రూల్ చేసింది. అమెరికా కూడా బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందినదే. 1776 జూలై 4న అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే పక్కనే ఉన్న కెనడాలో మాత్రం చాలా కాలం బ్రిటీష్ పాలనే సాగింది. ఆ టైమ్‌లోనే చాలా సార్లు బ్రిటీష్ సైన్యం అమెరికా భూభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. వాళ్ల ప్రయత్నాలను అమెరికా తిప్పికొట్టేది. ఈ క్రమంలోనే 1812 - 1815 మధ్య అమెరికాకు, బ్రిటీష్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే లేక్ చాంప్లెన్ అనే ఐలాండ్ ప్రాంతం భారీగా దెబ్బతింది.


బ్రిటీష్ సైన్యం ఈ ప్రాంతం నుంచి మళ్లీ అమెరికాలోకి చొరబడే ఛాన్స్ ఉందని గమనించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మేడిసన్.. లేక్ చాంప్లెన్ సరస్సు చుట్టూ భారీ కోట నిర్మించాలని భావించాడు. ఆ తర్వాత న్యూయార్క్ పరిధిలో ఉన్న లేక్ చాంప్లెన్‌కు అక్కడి ప్రభుత్వం కోట నిర్మాణం కోసం 400 ఎకరాలు కేటాయించింది. అధికారులు కోట నిర్మాణం ప్రారంభించారు. దాదాపు కోట నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఆ సమయంలోనే అంటే 1818లో తాము చేసిన పొరపాటును అధికారులు తెలుసుకున్నారు. అమెరికాలో నిర్మించాల్సిన కోటను.. పక్క దేశంలో నిర్మించారు. అది కూడా ఏ దేశం నుంచి తమ శత్రువులు రావొద్దని భావించారో.. అదే దేశంలో. ఆ తర్వాత కోట సామాగ్రితో సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకున్నారు.

అప్పటి నుంచి ఆ కోటను 'ఫోర్ట్ బ్లండర్' అని పిలవడం మొదలుపెట్టారు. 1783 పారిస్ ఒప్పందం ప్రకారం.. లేక్ చాంప్లెన్ కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ కిందకు వస్తుంది. దాదాపు 20 ఏళ్ల పాటు ఆ కోటను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ కోటపై స్థానికుల కన్నుపడింది. స్థానికులు కోటలోని రాళ్లు, ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత 1842లో సరిహద్దు పునరుద్ధరణ విషయమై అమెరికా, బ్రిటన్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో లేక్ చాంప్లెన్‌ను అమెరికా పొందింది.

Next Story