బాలకృష్ణను తాకిన నిరసన వేడి.. కారును అడ్డుకున్న కార్యకర్తలు..

By అంజి  Published on  30 Jan 2020 10:52 AM GMT
బాలకృష్ణను తాకిన నిరసన వేడి.. కారును అడ్డుకున్న కార్యకర్తలు..

అనంతపురం: సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. గురువారం హిందూపురంలో పర్యటించేందుకు వచ్చిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురంలో బాలకృష్ణ కారును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ సీమ ద్రోహులు అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రాయలసీమ ద్రోహి బాలకృష్ణ గో బ్యాక్‌ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

రాయలసీమ అభివృద్ధి ఇష్టం లేదా అంటూ బాలకృష్ణ కారుకు వైసీపీ నాయకులు అడ్డువెళ్లారు. అక్కడే ఉన్న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున టీడీపీ, వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానులకు ఎందుకు అడ్డుపడుతున్నారని బాలకృష్ణపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంలో పోలీసులు భారీగా మోహరించారు.

మొదటి నుంచి టీడీపీ వికేంద్రీకరణ వ్యతిరేకంగానే ఉంటూ వస్తోంది. దీంతో అటూ ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని టీడీప నేతలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సొంత ప్రాంత అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిపై ప్రజలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. అమరావతిలో రాజధానిని ఉంచాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులకు మద్దతుగా ప్రదర్శనలు చేస్తోంది.

Next Story