హిందూ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్ రూ.10 కోట్లు కేటాయింపు
By సుభాష్ Published on 25 Jun 2020 3:56 PM ISTహిందువులకు పవిత్ర దేవాలయమైన శ్రీకృష్ణుడికి పాకిస్థాన్‌లో ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మాణం కానుంది. ఈ ఆలయానికి పాక్ ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించనుంది. నిధులు కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీలపై తీవ్ర స్థాయిలో వివక్ష చూపించే పాక్.. ఓ మంచి కార్యానికి పునాది వేస్తోందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.
ఇస్లామాబాద్‌లో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. మొత్తం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్‌చంద్ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా క్రమ క్రమంగా పెరిగిపోతోందని, వారు దేవాలయానికి వెళ్లాలంటే ఎక్కడో దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌లో ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇస్లామాబాద్‌లోని హిందూ పంచాయతీకి సీడీఏ స్థలాన్ని 2017లోనే కేటాయించినట్లు వివరించారు.
తాజాగా ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రభుత్వం.. నిధులు కూడా విడుదల చేసిందని, ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు పాక్ ప్రభుత్వం నిధులు కేటాయించిన తరువాయే ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. కాగా, పాక్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో కూడా హిందూ దేవాలయానికి నిధులు కేటాయించడం గమనార్హం.