అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2020 7:42 AM GMT
అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన చట్టంలో కొన్ని సవరణలు చేయనున్నారు. ఈ చట్ట సవరణ ఎంఐఎంకు లబ్ది చేయడం కోసమే ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. జీహెచ్ఎంసీలో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే మించి సంతానం ఉండకూడదనే నిబంధన ఉంది.

అయితే ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ చట్ట సవరణ చేయనుంది. దీన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ చట్ట సవరణను నిరసిస్తూ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చింది. అలాగే బీజేపీ మరొక డిమాండ్ చేస్తోంది. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

ఈ రెండు డిమాండ్లపై బీజేపీ ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనాయకులను ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను రాష్ట్ర కార్యాలయంలో నిర్బంధించారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇద్దరి పిల్లల నిబంధన తొలగింపు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఉరి తాడుగా మారుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరి పిల్లల నిబంధనలను తొలగించటాన్ని బీజేపీ ఖండిస్తోందని అన్నారు. ఆంధ్ర సహా.. ఇతర రాష్ట్రాల సెటిలర్లు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తారు అని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామ‌ని.. టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పటానికి కలసి వచ్చే వారందర్నీ కలుపుకుని వెళ్తామ‌ని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయండని ప్ర‌జ‌ల‌కు చెప్పారు.

Next Story