డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 May 2020 4:16 PM ISTఅమరావతి : సస్పెండైన నర్సీపట్నం అనస్థీసియా డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైకోర్టు సీబీఐను ఆదేశించింది. ఘటనపై 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సీబీఐను కోరింది.
డాక్టర్ సుధాకర్ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని హైకోర్టు పేర్కొంది. నివేదిక వెనుక కుట్ర కోణం దాగి ఉందేమోన్న కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.
ఇదిలావుంటే.. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదుచేసి సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించటం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన డాక్టర్ సుధాకర్ కరోనాను ఎదుర్కొనేందుకు మాస్కులు, గ్లౌజులు లేవన్నందుకు సస్పెండ్ చేశారని.. విశాఖలో సుధాకర్ పెడరెక్కలు విరిచికట్టి పిచ్చివానిగా చిత్రీకరించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నించిందని.. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని రామకృష్ణ ఫైరయ్యారు.