జగన్‌ సర్కార్‌కు హైకోర్టు ఝలక్‌.. ఆ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశం..

By అంజి  Published on  2 March 2020 10:58 AM GMT
జగన్‌ సర్కార్‌కు హైకోర్టు ఝలక్‌..  ఆ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశం..

ముఖ్యాంశాలు

  • స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై విచారణ
  • ప్రభుత్వ జీవోను సస్పెండ్‌ చేసిన హైకోర్టు
  • 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టు ఆదేశం

అమరావతి: రాష్ట్ర స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించిన ప్రభుత్వ జీవోను సస్పెండ్‌ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు పేర్కొంది. నెల గడిచేలోగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇది వరకే రిజర్వేషన్ల అంశంపై వాదనలు హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో 50 శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదని తీర్పు చెప్పిందని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరో వైపు ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకొవచ్చని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఎలా ముందకెళ్లనున్న అంశం ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it