కార్యాలయాల తరలింపుపై హై కోర్టు ఆగ్రహం
By రాణి
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి కర్నూల్ కు కార్యాలయాలను తరలించడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని తరలింపుపై రైతులు వేసిన పిటిషన్లు పెండింగ్ లో ఉండగానే కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది ధర్మాసనం. సీఎం జగన్ మోహన్ రెడ్డి గత శుక్రవారం అర్థరాత్రి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూల్ కు తరలిస్తూ జీఓలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు...సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కార్యాలయాలను తరలించవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎందుకు తరలిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా...కార్యాలయాల తరలింపు ప్రభుత్వ నిర్ణయమని, ఇక్కడ కార్యాలయాల నిర్వహణ సరిగా లేనందునే కర్నూల్ కు తరలించామని ఏజీ వివరించారు. కార్యాలయాల నిర్వహణ సరిగా లేకపోతే స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేప్పట్టాల్సిందిగా న్యాయమూర్తి సూచించారు. కాగా..రైతులు వేసిన పిటిషన్లతో పాటు మరో రెండు పిటిషన్ల పై విచారణ చేశాక హై కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.