ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కాపాడమని కోర్టుకు వెళితే.. జరిమానా కట్టాల్సి వచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 3 Jun 2020 11:09 AM GMTఓ ప్రేమ జంట పెళ్లిచేసుకుంది. పెద్దలకు తెలియకుండా వివాహాం చేసుకోవడంతో ఎక్కడ విడదీస్తారోనని కాపాడమని కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆ న్యాయంస్థానం నవదంపతులకు రూ.10వేల ఫైన్ విధించడంతో పాటు వారికి రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి ఫైన్ ఎందుకు వేసారో తెలుసా..?
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఓ ప్రేమ జంట తమ పెద్దలకు ఇష్టం లేకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది. పెద్దలు ఎక్కడ తమని విడదీస్తారన్న భయంతో పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను న్యాయమూర్తికి సమర్పించారు. జస్టిస్ హరి పాల్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం వాటిని పరీశీలించి వారికి రూ.10వేల జరిమానా విధించారు.
పెళ్లి సమయంలో వధూవరులతో పాటు ఆ పెళ్లికి హాజరైన వారు కూడా కరోనా నిబంధనలు పాటించలేదని గుర్తించారు. ఒక్కరు కూడా ముఖానికి మాస్కులు ధరించలేదు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలన్నారు. వారు చెల్లించిన నగదుతో హోషియార్‌పూర్‌లోని ప్రజలకు మాస్కులు అందించాలని, నవదంపతులకు రక్షణ కల్పించాలని గురుదాస్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.