నిఘా వర్గాల హెచ్చరికతో ఢిల్లీలో హై అలర్ట్
By సుభాష్
దేశ రాజధాని అయిన ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచివుందని, భారీ విధ్వంసం పాల్పడేందుకు ప్లాన్‌వేసినట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టదిట్టం చేశారు. ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా, భారత్ -చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయ ప్రాంతంలో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు అనుకూలంగా మార్చుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోకి ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం ఉందన్నారు.
ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, అతిథి గృహాలు, ఇతర ప్రదేశాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఆస్పత్రులు, మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని అధికారులు తెలిపారు.
కాగా, తాజాగా భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఒక జవాను వీరమరణ పొందారు. మరో వైపు జమ్మూలో జరుగుతున్న కాల్పుల్లో భారత ఆర్మీ నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.