మీకు ముంబాయి మాఫియానే తెలుసు.. నెల్లూరుది తెలియ‌దు..!

By అంజి  Published on  7 Dec 2019 11:16 AM GMT
మీకు ముంబాయి మాఫియానే తెలుసు.. నెల్లూరుది తెలియ‌దు..!

నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ముసలం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు వైసీపీ వర్గాల్లో విభేదాలు, కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి అనిల్‌ కుమార్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను టార్గెట్‌ చేస్తూ ఆనం రామనారాయణ రెడ్డి సంచనన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరం మాఫియాకు అడ్డాగా మారిందన్నారు.

నెల్లూరు నగరంలో ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా, బెట్టింగ్‌లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. నగర సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నెల్లూరు నగరంపై ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నెల్లూరు నగర అభివృద్ధికి మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డిలు ఎంతో పాటు పడుతున్నారని ఆనం వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడే అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు మొదలైంది. నెల్లూరు గుండె నిబ్బరంతో పని చేసే పోలీసులు అధికారులు ఉన్న.. వెనక్కి తిరిగి చూసుకోని ఉద్యోగ భద్రతను కాపాడుకోవడానికి ముందడుగు వేయలేకపోతున్నారని ఆనం వ్యాఖ్యనించారు. ఎస్పీ శ్రీనివాసులు రెడ్డి ఉన్నప్పుడు నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేవన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరికి రావాలని.. ఏ రకం మాఫియా కావాలన్న నెల్లూర నగరానికి వెళ్లాలని ఆనం చెప్పుకొచ్చారు. నెల్లూరు ప్రజలు తమ సమస్యలను చెప్పుకోలేక అల్లాడుతున్నారని ఆనం పేర్కొన్నారు.

కాగా వెంటకగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పార్టీ అధినాయకుడు చెప్పినట్టుగానే నాయకులు నడుచుకోవాలన్నారు. ఏమైనా అభిప్రాయ బేధాలు ఉంటే సీఎం జగన్‌కు చెప్పాలని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్‌ మాటలను దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. గతంలో కూడా పలు సందర్భాల్లో పలువురు పార్టీ నాయకులపై చర్యలు తీసుకున్నామని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. విభేదాలను బహిరంగంగా చెప్పడం సమంజసం కాదన్నారు.

ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. నెల్లూరు నగరంలో ఎలాంటి మాఫియా లేదన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఏ విషయం గురించి మాట్లాడారో ఆయనే చెప్పాలన్నారు. సీఎం జగన్‌ ఎజెండాతోనే పని చేస్తున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Next Story
Share it