తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 9:55 AM GMT
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావం తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర ఇంటిరియర్‌ కర్ణాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ మేరకు రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రాతీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం కోస్తా ఆంధ్రా, యానం తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. కాగా..నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో దీని ప్రభావం అధికంగా ఉంటుందని..అందువల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Next Story
Share it