బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 11:23 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..!!

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రాబోయే 48 గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కోస్తాంధ్ర వైపు ఈ అల్పపీడనం కదులుతున్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి ప్రస్తుతం 45 -50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది మరింతగా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు, తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది నేడు మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. తమిళనాడు నుంచి కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రబావంతో కోస్తా తీరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముంది. కొన్ని చోట్ల 25 సెం.మీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణ, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

రికార్డ్ స్థాయిలో శ్రీశైలం ఏడోసారి గేట్లు ఎత్తివేత..!!

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ..శ్రీశైలానికి భారీ వరద వస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ మరోసారి ఉరుకలెత్తుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో శ్రీశైలానికి భారీగా వదర నీరు వచ్చి చేరుతోంది. జురాల, సుంకేశుల నుంచి 3 లక్షలకుపైగా ప్రవాహం వస్తుంది. దీంతో.. తొలుత శ్రీశైలం నాలుగు గేట్లను ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కల నీటిని విడుదల చేశారు. ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు బుధవారం ఉదయం 7 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4,48,648 లక్షలు కాగా.. ఔట్‌ ఫ్లో2,64,810లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటి నీటి మట్టం 884.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 214.807 టీఎంసీలుగా నమోదైంది. దీంతో అధికారులు శ్రీశైలంల ప్రాజెక్టు గేట్లను ఏడోసారి ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.

Next Story