జలదిగ్బంధంలో భాగ్యనగరం
By సుభాష్
భాగ్యనగరం జలదిగ్బంధమైపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. నగరంలో ఓ ప్రాంతంలో గోడ కూలి 9 మంది మృతి చెందారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో భారీగా వరదనీరు చేరి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఖైరతాబాద్, చింతల్‌బస్తీ, గాంధీనగర్, మారుతీనగర్, ఆనంద్‌నగర్, శ్రీనర్ కాలనీ, యూసుఫ్‌గూడ, కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, గాంధీనగర్ తదితర ప్రాంతాలలో భారీగా వరదనీరు నిలిచి ఇబ్బందిగా మారిపోయింది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజుల పాటు ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నగరంలో చాలా చోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఘట్‌కేసఱ్ సింగపూర్ టౌన్‌షిప్‌లో 32.3 సెం.మీ వర్షపాతం నమోదు కావడం వర్షం ఏ మేరకు కురిసిందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
హయత్‌నగర్ - 29.8 సెం.మీ
హస్తినాపురం - 28.4సెం.మీ
అబ్దుల్లాపూర్‌మెంట్ - 26.35 సెం.మీ
ఇబ్రహీంపట్నం - 25.7 సెం.మీ
సరూర్‌నగర్ - 27.35 సెం.మీ
ఉప్పల్ - 25.6 సెం.మీ
ముషీరాబాద్ -25.6 సెం.మీ
బండ్లగూడ -23.9 సెం.మీ
మేడిపల్లి 24.2 సెం.మీ
బాలానగర్ - 23.1సెం.మీ
సికింద్రాబాద్ -23.2
మల్కాజిగిరి - 22.6 సెం.మీ
హైదరాబాద్ - విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపై వరద భారీగా ప్రవహించింది. పలు కార్లు, బైక్‌లు నీట మునిగాయి. రోడ్డుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్డకే నిలిచిపోయాయి. పాత బస్తీలో దాదాపు 10 ఇళ్లకుపైగా కూలిపోయాయి. ఇలాగే ఇతర ప్రాంతాల్లో కూడా పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లు కూలిన ఘటనలో దాదాపు 12 మంది వరకు దుర్మరణం పాలయ్యారు.
రాష్ట్రంలో రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటింది. మరో వైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వచ్చే 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, సిద్దిపేట, రంగల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బుధవారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.