హైదరాబాద్‌లో భారీ వర్షం ..నగర వాసులకు ఉపశమనం
By సుభాష్
ఎన్నడు లేనంతగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కరియ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బయటకు వెళ్లేలేని పరిస్థితి ఉండేది. కాని ఆదివారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురియడంతో ప్రజలకు ఉపశమనం కలిగినట్లయింది. వరుణుడ కరుణించి భాగ్యనగరం వాసులకు ఎండల నుంచి రక్షించాడు. కాగా, నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, మల్కజ్‌గిరి, ఈసీఐఎల్, జవహార్‌నగర్, బీహెచ్‌ఈఎల్, యూసుఫ్ గూడ, కృష్ణానగర్, వెంటగిర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇన్ని రోజులు ఎండలు మండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ నగర ప్రజలకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయింది.
భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు, రైతులకు గుడ్‌న్యూస్ వినిపించిన విషయం తెలసిందే. ఒక వైపు దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే .. మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడు లేనంతగా ఎండలు తీవ్రంగా ఉండటంతో జనాలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఇక తాజాగా ఐఎండీ చల్లని కబురు చెప్పింది. జూన్ 1వ తేదీ నాటికే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ కారణంగా రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయిన తెలిపింది.
కాగా, శనివారం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ అరేబియా మహాసముద్రంలో మలదీవ్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. రాబోయే 48 గంటల్లో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. 48 గంటల తర్వాత ఈ అల్పపీడనం తూర్పు మధ్య అరేబియా సముద్రం గుండా కదలి వాయుగుండంగా ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. జూన్ 1 వరకూ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 5.9 మీటర్ల దూరంలో ఒక ద్రోణి కనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రాబోయే 24 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.