గ్యాస్ట్రిక్ అల్సర్ ఎందుకు వస్తుంది? కారణాలు, జాగ్రత్తలు!
ప్రస్తుత కాలంలో పెద్దవయస్సు వారికే కాదు యువతను కూడా పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్.
By - అంజి |
గ్యాస్ట్రిక్ అల్సర్ ఎందుకు వస్తుంది? కారణాలు, జాగ్రత్తలు!
ప్రస్తుత కాలంలో పెద్దవయస్సు వారికే కాదు యువతను కూడా పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్. చిన్న ప్రేగు, అన్నవాహిక , కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండటం అనేది అల్సర్‌గా భావిస్తుంటారు. దీని బారిన పడిన వారికి చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపంతో పాటు నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి తోడుకావటంతో 'గ్యాస్ట్రిక్ అల్సర్' సమస్య మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. బాధితులు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి నిత్యం హల్లోపతి మందులు వాడాల్సి ఉంటుంది.
అల్సర్‌కు కారణాలు:
మారిన జీవనశైలిలో నిత్యం ఒత్తిడికి గురికావడం, డైట్ సమయాల్లో మార్పులు చోటుచేసుకోవడం వలన అల్సర్ వచ్చేందుకు ప్రధాన కారణం. అలాగే కడుపులో యాసిడ్ పుడ్స్ జీర్ణం కాకపోవడంతో చిన్న పేగు యొక్క గోడలు పాడై అది అల్సర్‌కు దారితీస్తుంది. అయితే తాజాగా సైంటిస్టుల పరిశోధనల ప్రకారం అల్సర్‌కు హిలికోబ్యాక్టర్ పైలోరి లేదా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు అని కనుగొన్నారు.
అల్సర్ లక్షణాలు:
జీర్ణాశయంలో కడుపులో నొప్పి, మంట రావటం తేనుపులు ఎక్కువగా ఉండటం, గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగ ఉండటం, కడుపులో గడబిడలతో పుల్లటి తేనుపులు రావడం, తిన్నది సరిగా జీర్ణం కాక పోవటం, వాంతులు కావటం వంటివి అల్సర్‌కు లక్షణాలుగా చెప్పొచ్చు. కొందరిలో అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంటతో నిద్రాభంగం కావడం ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం ఏదైనా తినగానే వాంతులు కావడం లాంటివి జరగవచ్చు. అంతేకాదు భోజనం కాస్తంత తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపించడం. కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
అల్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు:
* ఎండోస్కోపీ పరీక్ష
* బేరియమ్ మీల్ ఎక్స్ రే
* బయాప్సీ లేదా ముక్క పరీక్ష
అల్సర్ రాకుండా జాగ్రత్తలు
* సమయానికి ఆహారం తీసుకోవాలి.
* మసాలాలు, కారం, కొవ్వులు, పుల్లటి పదార్థాలు వీటిలో వేటి వల్ల మంట తలెత్తుతుందో కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి.
* కలుషిత నీరు తాగకూడదు. పరిశుభ్రత పాటించాలి.
* పెయిన్ కిల్లర్స్ పరిమితంగా వాడాలి.
* ఒత్తిడి తగ్గించుకోవాలి.
* ధూమ, మద్యపానాలు మానేయాలి.