గొప్ప ఆవిష్కరణ.. ఇక అంధత్వమే ఉండదా..?
Pig-skin corneal implant restores sight in blind, visually impaired. భారతదేశంలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో
By Medi Samrat
లండన్: భారతదేశంలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో సహా అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. పంది చర్మం నుండి కొల్లాజెన్ ప్రోటీన్‌తో తయారు చేసిన ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది మనుషుల కార్నియాను పోలి ఉంటుంది. అంధత్వం, దృష్టి లోపం ఉన్నవారికి ఎంతగానో తోడ్పడనుంది. ఈ బయో ఇంజనీర్డ్ ఇంప్లాంట్.. దానం చేయబడిన మానవ కార్నియాల మార్పిడికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. కొన్ని దేశాల్లో నేత్ర దానం శాతం చాలా తక్కువగా ఉంది.. అటువంటి దేశాల్లో ఈ ఆవిష్కరణ ఎంతో మందికి కొత్త ఆశలను రేకెత్తిస్తుంది.
"హ్యూమన్ ఇంప్లాంట్‌లుగా ఉపయోగించబడే అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బయోమెటీరియల్‌ను అభివృద్ధి చేయడం సాధ్యమని ఈ ఫలితాలు చూపిస్తున్నాయి, వీటిని భారీగా ఉత్పత్తి చేయవచ్చు. రెండు సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు. దృష్టి సమస్యలతో బాధపడుతున్న ఎంతో మందికి తోడ్పాటును అందించవచ్చు. కార్నియల్ కణజాలం కొరత తీర్చడమే కాకుండా.. కంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సలో కూడా ఊహించని మార్పులు తీసుకుని రావచ్చు" అని స్వీడన్‌లోని లింకోపింగ్ విశ్వవిద్యాలయం (LiU)లో బయోమెడికల్, క్లినికల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ అయిన నీల్ లగాలి చెప్పుకొచ్చారు.
నేచర్ బయోటెక్నాలజీ లో పైలట్ స్టడీలో భాగంగా పలు విషయాలను వెల్లడించారు. నేచర్ బయోటెక్నాలజీలో ప్రచురించబడిన పైలట్ అధ్యయనంలో, ఇంప్లాంట్ పరిశోధనల్లో భాగంగా భారతదేశం, ఇరాన్‌లో వ్యాధిగ్రస్తులైన కార్నియాలకు సంబంధించి 20 మంది దృష్టిలో మార్పులను తీసుకుని వచ్చారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న అంధుల దృష్టిలో చాలా మార్పులు వచ్చాయి. వారు సురక్షితంగా ఉండటమే కాకుండా, కార్నియా సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. అధ్యయనానికి ముందు అంధులుగా ఉన్న భారతీయుల్లో ముగ్గురికి ఆపరేషన్ తర్వాత సంపూర్ణ (20/20) దృష్టి ఉందని పరిశోధకులు తెలిపారు.
వైద్యుల బృందం.. కెరాటోకోనస్ వ్యాధికి చికిత్స చేయడానికి ఒక కొత్త ఇన్వాసివ్ పద్ధతిని కూడా అభివృద్ధి చేసింది. కెరటోకోనస్ రోగి కార్నియా శస్త్రచికిత్స ద్వారా తొలగించబడింది. దాని స్థానంలో దానం చేయబడిన కార్నియాతో భర్తీ చేయబడుతుంది. ఈ చికిత్సకు కుట్లు అవసరం కాగా.. కొత్త శస్త్రచికిత్సా పద్ధతికి కుట్లు అవసరం లేదు. కార్నియాలో కోతను అధునాతన లేజర్‌తో అధిక ఖచ్చితత్వంతో చేయవచ్చు.. అవసరమైనప్పుడు, సాధారణ శస్త్రచికిత్సా పరికరాలతో చేతితో కూడా ఈ పని చేయవచ్చు. ఈ పద్ధతిని మొదట పందులపై పరీక్షించారు. అక్కడ సాంప్రదాయిక కార్నియా మార్పిడి కంటే సరళమైనది.. సురక్షితమైనదిగా తెలుసుకున్నారు.
ఇరాన్, భారత్ లకు చెందిన సర్జన్లు 20 మంది అంధులు, కెరాటోకోనస్ కారణంగా దృష్టిని కోల్పోయే వారిపై ఈ కొత్త ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్ తర్వాత కంటి చుక్కలతో ఎనిమిది వారాల చికిత్స తీసుకుంటే సరిపోతుంది. సాంప్రదాయిక కార్నియా మార్పిడితో, చాలా సంవత్సరాలు ఔషధం తీసుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఈ రోగులను రెండు సంవత్సరాలు పరిశీలించగా.. ఎటువంటి సమస్యలు గుర్తించబడలేదు.