మగవారిలో హైపర్ టెన్షన్, స్థూలకాయం దూరమవ్వాలంటే.?
Men’s Health Month Sedentary lifestyle makes men prone to diabetes, hypertension. జూన్‌ను పురుషుల ఆరోగ్య నెలగా గుర్తించిన సందర్భంగా.. ఒక వైద్య, ఆరోగ్య సంస్థ 5,000 మంది పురుషులపై
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2023 2:45 PM GMTజూన్‌ను పురుషుల ఆరోగ్య నెలగా గుర్తించిన సందర్భంగా.. ఒక వైద్య, ఆరోగ్య సంస్థ 5,000 మంది పురుషులపై అధ్యయనం చేసింది. అయితే పురుషులలో వివిధ నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (NCDs) ప్రాబల్యాన్ని కనుగొంది. ప్రధానంగా సరైన జీవనశైలి లేకపోవడం వలన, ఆహారపు అలవాట్ల వల్ల 10% మంది పురుషులు హైపర్ టెన్షన్, 38% మంది ఊబకాయం, 22% మంది మధుమేహం వంటి వివిధ జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది.
ఇండస్ హెల్త్ ప్లస్ చేపట్టిన ఈ అధ్యయనంలో సుమారు 5,000 మంది నమూనాలను సేకరించారు. వీరు జనవరి 2020 నుండి డిసెంబర్ 2022 మధ్య ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వ్యక్తులు. వీరిలో 10% మంది పురుషులు రక్తపోటుతో, 38% మంది ఊబకాయంతో మరియు 22% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 36% మంది పురుషులలో హైపర్‌లిపిడెమియా ప్రబలంగా ఉందని, 53% మందికి విటమిన్ డి లేకపోవడం, 32% మందికి విటమిన్ బి12 లోపం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
ప్రధాన కారణాలు
NCDలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లని తేలింది. శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి పెరగడం, మద్యపానం, పొగాకు వినియోగం, ధూమపానం మాత్రమే కాకుండా వంశపారంపర్యంగా కూడా కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి. NCDలకు దారితీసే ముఖ్యమైన అంశాలలో జెనెటిక్స్ కూడా ఒకటి. వంశపారంపర్య కారణాల వల్ల ప్రజలు కొన్ని వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. వ్యాధుల నుండి తప్పించుకోడానికి ముందుగానే తెలుసుకోవడం, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం మంచిది. చికిత్సను ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో తెలుసుకోవాలి:
ఇండస్ హెల్త్ ప్లస్‌లో ప్రివెంటివ్ హెల్త్‌కేర్ స్పెషలిస్ట్ అమోల్ నైకావాడి మాట్లాడుతూ, “పురుషులలో స్ట్రెస్, యాంగ్జైటీ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇవి రక్తపోటు, ఊబకాయంతో సహా వివిధ వ్యాధులకు కారణమవుతాయి. పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడం, పేలవమైన ఆహారపు అలవాట్లు NCDల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. NCDల నుండి వచ్చే సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సకాలంలో ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం మంచిది. శారీరక శ్రమను పెంచడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సరైన జీవనశైలి, మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీవనశైలి వ్యాధులను ఎక్కువగా నివారించవచ్చు కాబట్టి మీ జీవనశైలిని మారిస్తే జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఆ మార్పులను మీరే చూడగలరు" అని అన్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వ్యాధులను ముందుగా గుర్తించడం వలన ప్రాణాలను కాపాడడమే కాకుండా.. అతని కుటుంబాన్ని కూడా కాపాడిన వాళ్లము అవుతాం. క్రమం తప్పకుండా పర్యవేక్షణ, తదుపరి చర్యలు తీసుకోవాలని అమోల్ నైకావాడి సూచించారు.
NCDల ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలు:
- మంచి ఆహారం తీసుకోవాలి. మీ ఆహారంలో తాజా కూరగాయలు మరియు పండ్లను చేర్చండి. ఉప్పు, చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు. వాటికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి.
- ఒత్తిడికి కారణమయ్యే వివిధ కారణాలను గుర్తించండి. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మీరు దృష్టి పెట్టండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యం. రోజువారీ వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
- మీరు ఇష్టపడే హాబీలలో పాల్గొనండి. మీరు ఆనందించే పని చేసుకోడానికి సమయాన్ని కేటాయించడం వలన మీరు విశ్రాంతి తీసుకోవడానికి, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది
- రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయండి. ధ్యానం, యోగా చేయడమే కాకుండా మసాజ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
- ధూమపానం, మద్యపానం మానేయండి, ఈ చెడు అలవాట్లు ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.