Dengue Cases : రాజధానిలో డెంగ్యూ భీభత్సం.. నాలుగు వేలు దాటిన కేసులు

దేశ‌ రాజధాని ఢిల్లీలో ప్రతి వారం ఐదు వందల మంది రోగులు నిర్ధారణ అవుతున్నారు. గత వారం కూడా కొత్తగా 480 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులుండగా.. మొత్తం డెంగ్యూ రోగుల సంఖ్య నాలుగు వేలు దాటింది.

By Kalasani Durgapraveen  Published on  7 Nov 2024 10:36 AM IST
Dengue Cases : రాజధానిలో డెంగ్యూ భీభత్సం.. నాలుగు వేలు దాటిన కేసులు

దేశ‌ రాజధాని ఢిల్లీలో ప్రతి వారం ఐదు వందల మంది రోగులు నిర్ధారణ అవుతున్నారు. గత వారం కూడా కొత్తగా 480 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులుండగా.. మొత్తం డెంగ్యూ రోగుల సంఖ్య నాలుగు వేలు దాటింది. గత వారం 23 కొత్త మలేరియా కేసులు కూడా నిర్ధారించబడ్డాయి. అలాగే 24 కొత్త చికున్‌గున్యా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం మలేరియా రోగుల సంఖ్య 709కి చేరుకోగా.. చికున్‌గున్యా రోగుల సంఖ్య 151కి చేరుకుంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నవంబర్‌లో కూడా ప్రజలు దోమల వల్ల కలిగే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఒక్క అక్టోబరు నెలలోనే 2,431 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇది గత నాలుగేళ్లతో పోల్చితే అత్యధికం. 2023 సంవత్సరంలో 2,003, 2022లో 1,238, 2021లో 1,196 కేసులు న‌మోద‌య్యాయి. గత వారంలో 480 డెంగ్యూ కేసులు ధృవీకరించబడ్డాయి. 467 మంది రోగులు MCD ప్రాంతానికి చెందినవారు కాగా.. ఒక రోగి NDMC ప్రాంతానికి చెందినవారు. 12 మంది రోగులు ఢిల్లీ కాంట్ ప్రాంతానికి చెందినవారు. 24 మంది చికున్‌గున్యా రోగులు, 23 మంది మలేరియా రోగులు MCD ప్రాంతంలో ఉన్నారు.

దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ఈ ఏడాది 21,20,717 సార్లు ఇళ్లల్లో దోమల నివారణ మందు, ఫాగింగ్‌ చేశామని కార్పొరేషన్‌ తెలిపింది. 3,35,76,170 సార్లు ఇళ్లను సందర్శించి దోమల మూలాన్ని పరిశోధించిన‌ట్లు వెల్ల‌డించారు. 1,53,451 మందికి లీగల్ నోటీసులు పంపామని.. 11,812 మందిపై చలాన్ చర్యలు తీసుకున్నామని తెలిపారు.

డెంగ్యూ పుట్టుకలో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డెంగ్యూ దోమలు 15 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలలో వృద్ధి చెందుతాయి. ప్రస్తుతం 25 నుంచి 30 మధ్య ఉండే ఉష్ణోగ్రత అత్యంత అనుకూలమైనది. ఈ పరిస్థితుల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అందువల్ల, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఫుల్‌ స్లీవ్‌ దుస్తులు ధరించాలి.. ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

Next Story