Kurnool: 6 నెలల శిశువు కిడ్నీల్లో రాళ్లు.. విజయవంతంగా తొలగించిన వైద్యులు

కర్నూలుకు చెందిన ఆరు నెలల పాపకు ఒక్కో కిడ్నీలో రెండు పెద్ద రాళ్లు ఉండడంతో మూత్ర విసర్జనకు ఆటంకం ఏర్పడి తాత్కాలికంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది.

By అంజి  Published on  15 Oct 2024 10:25 AM IST
Kurnool, 6-month-old baby, kidney stones, doctors, KIMS

Kurnool, 6-month-old baby, kidney stones, doctors, KIMS

కర్నూలుకు చెందిన ఆరు నెలల పాపకు ఒక్కో కిడ్నీలో రెండు పెద్ద రాళ్లు ఉండడంతో మూత్ర విసర్జనకు ఆటంకం ఏర్పడి తాత్కాలికంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి నివేదించబడిన మొదటి కేసు ఇది. ప్రపంచవ్యాప్తంగా.. ఇది ప్రతి 100,000 మంది పిల్లలలో 10 మందిలో మాత్రమే సంభవిస్తుంది.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లల అవయవాలు, ముఖ్యంగా ఆరు నెలల వయస్సులో ఉన్న శిశువులలో, చాలా సున్నితమైనవి, చిన్నవిగా ఉంటాయి. ఈ వయస్సులో ఉన్న శిశువులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం చాలా అసాధారణం, ముఖ్యంగా మూత్ర విసర్జనను అడ్డుకునేంత పెద్ద రాళ్లు ఏర్పడి, మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి.

కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాపరోస్కోపిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డాక్టర్ వై. మనోజ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం RIRS (రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ) అనే అధునాతన ఎండోస్కోపిక్ విధానాన్ని ఉపయోగించి మొత్తం నాలుగు రాళ్లను విజయవంతంగా తొలగించింది.

"ఆర్మీలో ఉన్న తండ్రి డ్యూటీకి దూరంగా ఉన్నందున.. శిశువును తల్లి, ఆమె మామ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువు మూత్ర విసర్జన చేయలేకపోవడం, తీవ్రమైన కడుపు వాపు కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. పూర్తి పరీక్షల తర్వాత, మేము రెండు కిడ్నీలలో రాళ్లను కనుగొన్నాం. శిశువు కిడ్నీ వైఫల్యం అంచున ఉంది. రాయిని తొలగించే ముందు మేము వెంటనే కిడ్నీ పనితీరును స్థిరీకరించడానికి స్టెంట్‌లను చొప్పించాము, ఎడమ కిడ్నీలో 11 మిమీ, 9 మిమీ రాళ్లు, కుడి కిడ్నీలో 9 మిమీ, 7 మిమీ రాళ్ల ఉన్నాయి" అని డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు.

ఇవి సాధారణంగా పెద్దలలో కనిపించే పరిమాణాలు. ఇది అసాధారణమైన సందర్భం. ఎండోస్కోపిక్, లేజర్-సహాయక ప్రక్రియ ద్వారా రాళ్లను తొలగించారు. ఎటువంటి కోతలు లేకుండా ఆపరేషన్‌ జరిగింది. చుట్టుపక్కల అవయవాలకు గాయం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

రాళ్లుతొలగించిన తర్వాత, వైద్యుల బృందం స్టెంట్లను కూడా వెలికితీసింది. "పిల్లలలో, పెద్దవారితో పోలిస్తే రాళ్లు మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ, కాబట్టి నిరంతర పర్యవేక్షణ, మందులు అవసరం కావచ్చు. ఈ వయస్సులో విజయవంతమైన శస్త్రచికిత్స చేయడమే కాకుండా, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం చాలా అరుదు. రాష్ట్రం- కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన నిపుణులు ఈ విజయాన్ని సాధించగలిగారు" అని డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.

Next Story