యాంటీ బయోటిక్స్ వాడకంలో మనల్ని మించిన వారే లేరట..!

Indians consumed over 500 crore antibiotic tablets in a year. కోవిడ్-19 మహమ్మారి సమయంలో డోలో-650ని విపరీతంగా వైద్యులు సూచించడంపై తీవ్ర చర్చ జరిగింది.

By Medi Samrat  Published on  7 Sep 2022 2:30 PM GMT
యాంటీ బయోటిక్స్ వాడకంలో మనల్ని మించిన వారే లేరట..!

కోవిడ్-19 మహమ్మారి సమయంలో డోలో-650ని విపరీతంగా వైద్యులు సూచించడంపై తీవ్ర చర్చ జరిగింది. తాజాగా భారతీయులు యాంటీబయాటిక్స్‌ను అధికంగా వాడడాన్ని ఎత్తి చూపుతూ కొత్త అధ్యయనం చెబుతోంది. 2019లో భారతదేశం 500 కోట్లకు పైగా యాంటీబయాటిక్‌లను వినియోగించిందని పరిశోధకులు కనుగొన్నారు, అందులో అజిత్రోమైసిన్ ఎక్కువగా వినియోగించే యాంటీబయాటిక్ అని తేలింది. యాంటీబయాటిక్స్ అమ్మకం మరియు వినియోగాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి కొత్త నిబంధనలు అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది.

లాన్సెట్ రీజినల్ హెల్త్ ఆగ్నేయాసియా జర్నల్‌లో భారతదేశంలో యాంటీబయాటిక్స్ ను విపరీతంగా వినియోగిస్తూ ఉన్నారని తేల్చింది. " భారతదేశం అతిపెద్ద యాంటీబయాటిక్ వినియోగదారు అయినప్పటికీ, యుఎస్, ఐరోపాలో కనిపించే విధంగా యాంటీమైక్రోబయల్ స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్‌కు మార్గనిర్దేశం చేయడానికి దేశంలో యాంటీబయాటిక్ వినియోగ నిఘాకు అధికారిక వ్యవస్థ లేదు" అని పరిశోధకులు తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి రాక ముందు.. ఆ త‌ర్వాత భార‌త్ యాంటీ బయాటిక్స్ ను అత్య‌ధికంగా వాడుతున్న‌ట్లు లాన్సెట్ జ‌ర్న‌ల్ రిపోర్ట్ పేర్కొంది. కాస్తంత జ‌లుబో, జ్వ‌ర‌మో రాగానే వెంట‌నే ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాం. కానీ వాటి వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏంట‌ని ఆలోచించ‌కుండా మితిమీరి వాడుతున్నారని తేలింది. కొన్ని యాంటీ బయాటిక్స్ ను సెంట్ర‌ల్ డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ అప్రూవ‌ల్ కూడా లేద‌ని.. ఈ స‌మ‌స్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించి మార్పు తీసుకురావాల‌ని సూచించింది లాన్సెట్ రిపోర్ట్. సెప్టెంబ‌ర్ 1వ తేదీన విడుద‌ల చేసిన నివేదిక‌లో ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. అప్రూవ‌ల్ లేని, నాసిర‌క‌మైన యాంటీ బయాటిక్స్ ను విప‌రీతంగా వాడ‌టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, వీటి వ‌ల‌న‌ భార‌తీయులు క్ర‌మంగా యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ కోల్పోతార‌ని హెచ్చ‌రించింది.

భార‌తదేశంలో గ‌ల ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ సెక్టార్ల నుండి సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం దాదాపు 9000 ప్యాన‌ల్స్ నుండి ఈ యాంటీ బయాటిక్స్ డ్ర‌గ్స్ కొనుగోలు జ‌రుగుతున్నట్లు వెల్ల‌డైంది. అజిత్రోమైసిన్ ను భార‌తీయులు అత్య‌ధికంగా 640 మిలియ‌న్ల డీడీడీ 12.6%, సెఫిక్సైమ్ 516 మిలియ‌న్, 10.2%, డీడీడీలుగా వినియోగిస్తున్నార‌ని స‌ర్వేలో పేర్కొంది ఈ సంస్థ‌. మ‌రో వైపు 500 ఎంజీ అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ ను 384 మిలియ‌న్ల డీడీడీలుగా, 200 ఎంజీ సైఫిక్సైమ్ 331 మిలియ‌న్ డీడీడీలుగా వినియోగిస్తున్న‌ట్లు వివ‌రాల‌ను వెల్ల‌డించింది లాన్సెట్ జ‌ర్న‌ల్. US-ఆధారిత సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, యాంటీబయాటిక్స్ అనేవి మానవులు, జంతువులలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే మందులు. బాక్టీరియాను చంపడం లేదా వాటి పెరుగుదలను యాంటీ బయోటిక్స్ కష్టతరం చేస్తాయి.


Next Story