వేసవి కాలంలో మనకు సహజంగా గ్యాస్, అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం ఈ కాలంలో త్వరగా జీర్ణమవడంతో పాటు జీర్ణాశయంలో చీటికి మాటికి గ్యాస్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. దీంతో మనకు ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ఇలాంటి గ్యాస్, అసిడిటీ సమస్య వచ్చినప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చంటున్నారు వైద్య నిపుణులు.
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా మనకు గ్యాస్ వస్తుంటుంది. కాబట్టి నిత్యం తగిన మోతాదులో నీటిని తాగుతుండాలి. దీని వల్ల జీర్ణాశయంలో ఉండే యాసిడ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఫలితంగా గ్యాస్ రాకుండా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు కూర్చుని ఉండాలి. పడుకోకూడదు. లేదంటే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సమస్యను తొలగించడంలో అల్లం ఎంతో పని చేస్తుంది. గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. దీంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ సోడా, నీటి మిశ్రమాలలో దేనిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులలో గ్యాస్ సమస్యలను దూరం చేసే గుణాలు చాలా ఉంటాయి. వీటి వల్ల కూడా సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.