ఒక్క సంవత్సరం సిగరెట్ మానితే 50 రోజులు.. అదే పూర్తిగా మానేస్తే..
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇటీవలి పరిశోధన సిగరెట్‌తో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి షాకింగ్ గణాంకాలను వెల్లడించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 9:50 AM ISTసిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇటీవలి పరిశోధన సిగరెట్‌తో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి షాకింగ్ గణాంకాలను వెల్లడించింది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ (UCL) అధ్యయనం ప్రకారం.. సిగరెట్ తాగడం వల్ల పురుషుల జీవితం సగటున 17 నిమిషాలు, స్త్రీల జీవితం నుండి 22 నిమిషాలు కరిగిపోతుంది. ఇంతకు ముందు కూడా సిగరెట్లపై చాలాసార్లు అధ్యయనాలు జరిగినా ఈసారి మాత్రం ఆ పరిశోధన భయానకంగా ఉంది. ఈ గణాంకాలు మునుపటి అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.. ఈ క్రమంలోనే ధూమపానం చేసేవారు ఈ చెడు అలవాటును విడిచిపెట్టి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని UCL పరిశోధకులు అంటున్నారు.
ఒక సిగరెట్ ఒక వ్యక్తి 20 నిమిషాల జీవితాన్ని హరిస్తుందని అధ్యయనం పేర్కొంది. అంటే 20 సిగరెట్ల ప్యాక్ ఒక వ్యక్తి జీవితంలోని ఏడు గంటల ఆయుష్షును తగ్గిస్తుంది. UCLలో ప్రిన్సిపల్ రీసెర్చ్ ఫెలో అయిన డాక్టర్ సారా జాక్సన్ ప్రకారం.. ధూమపానం హానికరం అని సాధారణంగా ప్రజలకు తెలుసు.. కానీ చాలా తక్కువగా అంచనా వేస్తారు. అయితే.. సగటున ధూమపానం అలవాటు ఉన్నవారు దాదాపు 10 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నారు.
'సిగరెట్ తాగేవారు ఎంత త్వరగా మానితే.. వారి జీవితాలు అంత ఎక్కువ కాలం, ఆరోగ్యంగా ఉండగలవు' అని పరిశోధన సూచించింది. కొత్త సంవత్సరం రోజున ధూమపానం మానేసినట్లయితే.. వారు ఫిబ్రవరి 20 నాటికి వారి జీవితంలో ఒక వారం తిరిగి పొందవచ్చని.. వచ్చే సంవత్సరం చివరి నాటికి.. 50 రోజుల జీవితాన్ని కోల్పోకుండా తిరిగి పొందవచ్చని పేర్కొంది.
రోజుకు 20 సిగరెట్లు తాగే వారితో పోలిస్తే రోజుకు ఒక సిగరెట్ తాగే వారికి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 50 శాతం మాత్రమే తక్కువ. కాబట్టి ఒక సిగరేట్ తాగడం కూడా హానికరమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ధూమపానం మహమ్మారి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మందిని చంపుతుంది.