కోవిడ్-19 వ్యాప్తి.. ఈ లక్షణాలు కనిపించొచ్చు
ఆసియా దేశాల్లో కోవిడ్-19 వ్యాప్తి మొదలైంది. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్‌లలో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
By Medi Samrat
ఆసియా దేశాల్లో కోవిడ్-19 వ్యాప్తి మొదలైంది. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్‌లలో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులలో గత కొన్ని వారాలుగా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆసియాలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైనది JN.1 వేరియంట్. "ప్రస్తుతం, ఓమిక్రాన్ ఉప-వేరియంట్ అయిన JN.1 కి కారణమైన కేసుల పెరుగుదలను మనం చూస్తున్నాము. జ్వరం, జలుబు, దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ, ఇది అంటువ్యాధిగా ఉంటుంది" అని మాక్స్ హెల్త్‌కేర్ పల్మనాలజీ, పీడియాట్రిక్ పల్మనాలజీ డైరెక్టర్ & HOD డాక్టర్ శరద్ జోషి తెలిపారు.
US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఈ వేరియంట్ మొదట USలో సెప్టెంబర్ 2023లో కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1 జాతిని ఆందోళన కలిగించే వేరియంట్ కాదని తెలిపింది. JN.1 లక్షణాలను చూస్తే.. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, కండరాల బలహీనత లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. JN.1 జీర్ణశయాంతర సమస్యలను కూడా కలిగిస్తుందని, విరేచనాలు, ఆకలి లేకపోవడం, వికారం, విపరీతమైన అలసట అనేవి JN.1 ద్వారా వచ్చే సమస్యలు. అయితే వీటి వలన భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్త వహించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.