అందుకే మొలకలను 'సూపర్ ఫుడ్స్' అంటారు..!
విత్తనాలు, గింజలు చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మొలకలుగా మార్చినట్లయితే.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
By Medi Samrat
విత్తనాలు, గింజలు చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మొలకలుగా మార్చినట్లయితే.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మొలకలలో ఉండే విటమిన్లు, ఖనిజాల పరిమాణం రెట్టింపు అవుతుంది. వాటిలో అనేక ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఉదయం అల్పాహారంగా తీసుకోవడం మంచి ఆప్షన్. చాలా మంది దీనిని సలాడ్ రూపంలో ఆహారంలో చేర్చుకుంటారు. కొంతమంది వీటిని ఉడకబెట్టి.. చాట్ లాగా కూడా తింటారు. మొలకలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
మంచి పోషక విలువలు..
మొలకెత్తని విత్తనాలు, బీన్స్ లేదా గింజలతో పోలిస్తే.. మొలకెత్తిన విత్తనాలు, గింజలు తినడం ద్వారా పోషక విలువలు వేగంగా పెరుగుతాయి. మొలకలలో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ప్రొటీన్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగుకు..
శరీరంలో అనేక రసాయన ప్రతిచర్యలతో పాటు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో మొలకలు సహాయపడతాయి.
వృద్ధాప్య ప్రక్రియ
మొలకలలో ఫైటోకెమికల్స్, బయోఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడుతుంది.
రక్త శుద్ధికి..
మొలకలలో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను కూడా నివారిస్తుంది. ఇందులో ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బరువు తగ్గడానికి..
మొలకలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తక్కువ కేలరీ కంటెంట్ కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కూడా అందిస్తుంది.
ఈ వ్యక్తులు దూరంగా ఉండాలి
పిల్లలు, గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు పచ్చి మొలకలు కారణంగా అజీర్ణంతో బాధపడవచ్చు. వారి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాంటప్పుడు మొలకలను ఉడకబెట్టి అందులో జీలకర్ర, గరంమసాలా, ఇంగువ వంటి మసాలా దినుసులు కలుపుకుని తినాలి.