టెన్షన్ అక్కర్లేదు.. చిట్టా విప్పిన ఈటెల
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2020 6:52 AM GMTప్రపంచమంతా ఒకలా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టేవాళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాయదారి రోగానికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక మందు అయితే.. కట్టడి చర్యల్లో భాగంగా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఎలా ఉందన్న విషయాన్ని తేల్చేందుకు పెద్ద ఎత్తున టెస్టుల్ని చేస్తున్నారు. పొరుగున ఉన్న ఏపీలో రోజుకు 20వేలకు పైనే టెస్టుల్ని చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం వందల పరీక్షలకే పరిమితమవుతున్నారు.
ఇదేం లాజిక్కు అన్న వారికి సూటి సమాధానం చెప్పని సర్కారు తీరుతో కొత్త అయోమయం వ్యక్తమవుతోంది. నిర్దారణ పరీక్షల్ని చేపట్టటం ద్వారా.. అనుమానితుల్లో ఉండే భయాందోళనలతో పాటు.. ఒక ప్రాంతంలో ఏ మేరకు వ్యాప్తి జరిగిందన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో పాజిటివ్ వచ్చిన కుటుంబాల్లోనూ పరీక్షలు జరపని వైనం చర్చనీయాంశంగా మారింది.
చార్మినార్ జోన్ పరిధిలోని ఒక పోలీసు కానిస్టేబుల్ తనకు రోగ లక్షణాలకు సంబందించి సందేహాలు ఉన్నాయని.. తనకు పరీక్షలు జరపాలని కోరుతూ ఆసుపత్రికి నాలుగుసార్లు వెళ్లినా నిర్దారణ పరీక్ష చేయలేదు. దీంతో.. ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాత పరీక్ష నిర్వహించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదాహరణలు కనిపిస్తాయి. ఇలాంటివేళ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యులు.. పోలీసులు.. జర్నలిస్టులు.. ఇలా ప్రత్యేక విధుల్లో ఉన్న వారికి పరీక్షలు చేయటం లేదన్న వాదనను తోసిపుచ్చుతున్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం తప్పన్న ఆయన.. కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సంబంధం లేని వీడియోలు చూపిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు.
తమ వద్ద నిర్దారణ పరీక్షలకు సంబంధించిన టెస్టు కిట్లు పుష్కలంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద పది లక్షలకు పైగా పీపీఈ కిట్లు ఉన్నాయని.. మరో 11 లక్షల ఎన్ 95 మాస్కులు ఉన్నట్లు చెప్పారు. వైద్యులకుఇచ్చే మాస్కులు.. గ్లౌజులకు కొరత లేదన్న ఆయన.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల హెచ్ క్యూ ట్యాబ్లెట్లు.. 56లక్షల అజిత్రోమైసిన్ టాబ్లెట్లు ఉన్నట్లు చెప్పారు. వైరల్ ఫీవర్ కు సంబంధించిన టాబ్లెట్లు పెద్ద ఎత్తున ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి ఉన్న వెంటిలేటర్లకు అదనంగా మరో 150 తెప్పించామని.. కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు ఇవ్వమని కోరినట్లు చెప్పారు.
ఇప్పటికే యాభై వచ్చాయని.. త్వరలో 950 వెంటిలేటర్లు వస్తాయన్నారు. ఎన్నివేల పాజిటివ్ కేసులు వచ్చినా.. చికిత్స చేయటానికి ప్రభుత్వం సన్నద్దంగా ఉందన్నారు. ఇన్ని చెప్పిన ఈటెల.. నిర్దారణ టెస్టుల్ని ఎక్కువగా ఎందుకు చేయటం లేదన్న ప్రశ్నకు మాత్రం సూటి సమాధానం రాని పరిస్థితి. అన్ని ఉన్నప్పుడు.. నిర్దారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తే ప్రజలకు మరింత భరోసా ఇచ్చినట్లు అవుతుంది కదా? ఆ విషయాన్ని టీ సర్కారు ఎందుకు మిస్ అవుతున్నట్లు?.