విలేఖరిపై హెడ్‌కానిస్టేబుల్‌ వీరంగం.. నా నిద్ర ఎందుకు చెడ‌గొట్టావురా?

By Newsmeter.Network  Published on  24 Dec 2019 9:00 AM GMT
విలేఖరిపై హెడ్‌కానిస్టేబుల్‌ వీరంగం.. నా నిద్ర ఎందుకు చెడ‌గొట్టావురా?

ముఖ్యాంశాలు

  • పత్రికా విలేఖరిపై జీడిమెట్ల హెడ్‌ కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన
  • నిద్ర ఎందుకు చెడ‌గొట్టావు అంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్బాష
  • డీజీపీ మహేందర్‌ రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: ఓ పత్రికా విలేఖరిపై జీడిమెట్ల హెడ్‌ కానిస్టేబుల్‌ దురుసుగా ప్రపర్తించాడు. నిద్ర కరాబు చేశావంటూ విలేఖరి చెంప చెళ్లుమనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్లలోని హెచ్‌ఏఎల్‌ కాలనీలో సోమవారం వేకువ జామున అల్లరిమూకలు గొడవ పడుతున్నాయి. ఓ పత్రికలో విలేఖరిగా పని చేస్తున్న యువకుడు టి.శివకృష్ణ విధులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. తన ఇంటకి సమీపంలోనే గొడవ జరుగుతుండటంతో వెంటనే 100కి డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. కొద్ది సమయం తర్వాత మరోసారి పోలీసులకు ఫోన్‌ చేసిన శివరామకృష్ణ గొడవ సద్దుమణిగేలా ఉందని సమాచారం అందించాడు. అయితే మరో 20 నిమిషాల తర్వాత అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. కొందరు వ్యక్తులు గొడవ చేయడం ప్రారంభించారు. 20 నిమిషాల తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి అల్లరిమూకలు పరారు అయ్యారు.

పోలీసు వాహనం దగ్గరికి రావాలని యువకుడికి ఫోన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు సూచించాడు. వాహనం దగ్గరకు వచ్చిన యువకుడిపై హెడ్‌ కానిస్టేబుల్‌ విరుచుకుపడ్డాడు. అర్థరాత్రి నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా..? అంటూ చెంప చెళ్లుమనిపించాడు. ఎవరో కొట్టుకొని చస్తే నీకేందుకురా అంటూ బూతుల దండకం మొదలు పెట్టాడు. శివకృష్ణ రెండు చెంపలు వాయించి, తిడుతూ వాహనంలో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివకృష్ణ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అరగంటపాటు కాలనీలో గాలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరారవు యువకుడి ఫోన్‌ లాక్కున్నాడు. పోలీస్‌స్టేషన్‌లో యువకుడు పత్రికా విలేఖరి అని తెలుసుకొని హెడ్‌ కానిస్టేబుల్‌ నోరు కరుచుకున్నాడు. అనంతరం యువకుడిని పోలీసులు తిరిగి ఇంటి వద్ద దిగబెట్టారు. కాగా ఈ ఘటనపై శివకృష్ణ కుటుంబ సభ్యులు డీజీపీ మహేందర్‌ రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కోటేశ్వరరావును సీఏఆర్‌కు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. డయల్‌ 100కి ఫోన్‌ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మరీ ఎలా కొడతారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story