హత్రాస్‌ ఘటనలో ట్విస్ట్.. బాధితురాలిపై అత్యాచారం జరగలేదట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 6:43 PM IST
హత్రాస్‌ ఘటనలో ట్విస్ట్.. బాధితురాలిపై అత్యాచారం జరగలేదట

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత అమ్మాయిపై పాశవిక రీతిలో అత్యాచారం చేశారంటూ దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని గొంతు నులిపి ఊపిరిఆడకుండా చేయడం వల్లే మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైందని యూపీ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.

గత నెల 14న పొలంలో పని చేస్తున్న యువతిపై నలుగురు మృగాళ్లు పాశవీకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పొరాడుతూ మరణించింది. ఈ క్రమంలో ఏడీజీ మాట్లాడుతూ.. ‘ఫోరెన్సిక్‌ నివేదికలో వీర్యం కనుగొనడబలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని స్పష్టం అవుతోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అన్నారు.

దిల్లీకి సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు శవ పరీక్ష నిర్వహించారు. బాధితురాలి మెడ ఎముక విరిగి ఉందని.. అక్కడి నుంచి రక్తస్రావం అయిందని వివరించారు. ఆమె రహస్య అవయవాల వద్ద గాయాలున్నట్లు తెలిపిన నివేదిక ఎలాంటి వీర్య కణాలు ఉన్నట్లు ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించింది. మెడపై కమిలిన గుర్తులు ఉండడంతో యువతి చున్నీ బిగించి గొంతు నులిమేందుకు ప్రయత్నించారనే వాదన నిజమేనని తేలింది. కాగా.. దుండగులు ఆమె గొంతు నులిమే క్రమంలో ఆమె నాలుక తెగి ఉండవచ్చని అంటున్నారు.

ఓ వైపు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌ జరిగిందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఏడీజీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం పాదయాత్రగా వెళుతున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రనేతల అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

అసలు అత్యాచారం జరగలేదంటున్న పోలీసులు.. అర్ధరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు ఎందుకు చేశారు? పెళ్లికాని యువతికి వారి ఆచారం ప్రకారం ఖననం చేస్తారు. వాళ్ల ఆచారాన్ని కాదని ఎందుకు దహనం చేశారు? ఖననం చేస్తే రీపోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందనే భయమా? కాల్చేస్తే సాక్ష్యాలు మిగలవనే ఉద్దేశంతోనే దహనం చేశారా? బాధితురాలి కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.

Next Story