హర్యానాలో హంగ్..దుష్యంత్ పై ఆశలు పెట్టుకున్న బీజేపీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 1:34 PM GMT
హర్యానాలో హంగ్..దుష్యంత్ పై ఆశలు పెట్టుకున్న బీజేపీ..!

హర్యానా: బీజేపీనా..? కాంగ్రెస్సా..? దుష్యంతున్ని అట్రాక్ట్ చేసేదెవరు..? హస్తం పార్టీతో జేజేపీ చేతులు కలుపుతుందా..? లేక.. కమలదళంతో కలసిపోతుందా..? చౌతాలా ఎటు వైపు మొగ్గు చూపుతారు..? కర్ణాటక ప్లాన్‌ను హర్యానాలో అప్లై చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా..?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ సింగిల్‌గా మెజార్టీ సాధించలేకపోయాయి. కమలదళానికి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. అనూహ్యంగా దుష్యంత్ చౌతాలకు చెందిన జననాయక జనతా పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించిం ది. ఆ పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. స్వతంత్రులు, ఇతరులు 10 స్థానాల్లో గెలిచి కీలకంగా మారారు. జేజేపీ లేదా స్వతంత్రుల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టసాధ్యంగా మారింది.

హర్యానా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 90. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. బీజేపీకి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేల బలముంది. ఈ లెక్కన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కాంగ్రెస్‌కు 16 మంది శాసన సభ్యుల అండ అవసరం. దాంతో రెండు పార్టీల దృష్టి జేజేపీ, స్వతంత్రులపై పడింది. జేజేపీని కలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీ సులువు అవు తుంది. కాంగ్రెస్‌కు మాత్రం జేజేపీతో పాటు స్వతంత్రుల మద్ధతు కూడా తప్పనిసరి.

కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ దుష్యంత్ చౌతాలా మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీకి మద్ధతు ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. కాంగ్రెస్, బీజేపీల ప్రతిపాదనలపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎం పదవి ఎవరిస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని గతంలో ప్రకటించిన దుశ్యంత్, ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉంటారో లేదో చూడాలి.

Next Story