Fact Check : శానిటైజర్ల కారణంగా వాహనంలో మంటలు చెలరేగాయా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
కోవిద్-19 విపరీతంగా ప్రబలుతూ ఉండడంతో హ్యాండ్ శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డాక్టర్లు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా శానిటైజర్లను ఎక్కువగా వాడమని చెబుతున్నారు. శానిటైజర్ కారణంగా ఘోరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుందని చెబుతూ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. శానిటైజర్ కారణంగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఇంతకూ అది నిజమా.. కాదా..?
నిజ నిర్ధారణ:
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వాహనం తగలబడుతూ ఉండగా.. ఆ వ్యక్తి డ్రైవర్ సీట్ లో కూర్చుని ఉన్నారు. మొత్తం తగలబడుతున్నా కూడా ఆ వ్యక్తి కదలడం లేదు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అయిన వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు.
“Delhi; Sanitizer Blast in heat at Rohini flyover, Delhi. Please, Never keep full bottles of sanitizer in the car. Carry just very little in a bottle, never leave it in the car and expose in heat.”
ఢిల్లీలో శానిటైజర్లు పేలిపోయాయి. రోహిణి ఫ్లై ఓవర్ మీద వాహనం తగలబడి పోతోంది. శానిటైజర్లను కారులోనే వదిలేయకండి. కొంచెం శానిటైజర్ ను మాత్రమే తీసుకుని వెళ్ళండి.. కార్ ను ఎండలో పెట్టకండి అని వీడియో గురించి రాసుకుని వచ్చారు.
ఆ వీడియోలో పొగతో నిండిపోయిన వ్యాన్ ను చూడొచ్చు. డ్రైవర్ సీట్ లో ఉన్న ఓ వ్యక్తి కాలిపోతూ ఉండడం చూడొచ్చు. విండో బయట చేయి ఉండడాన్ని చూడొచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేత నగ్మా మొరారీ కూడా ఈ వీడియోను మే 26, 2020న షేర్ చేశారు.
ప్రభుత్వ అధికారులైన డాక్టర్ రాజశ్రీ సింగ్ ఐపీఎస్, ఐజీపీ హర్యానా స్టేట్ క్రైమ్ కూడా ఈ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
న్యూస్ మీటర్ ఈ వీడియోపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా.. ఆ వీడియో గురించి చెబుతోందంతా అబద్ధమేనని తెలుస్తోంది. వీడియోకు చెందిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను చేయగా.. ఇది మే 21వ తేదీన చోటుచేసుకున్న ఘటనగా తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, జీ న్యూస్ ఈ ఘటనపై రిపోర్ట్ చేశాయి. మీడియా సంస్థకు చెందిన రిపోర్టుల ప్రకారం ఈ ఘటన ఢిల్లీ లోని మంగోల్ పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. సిఎన్జి ట్యాంక్ లీక్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని జీ న్యూస్ చెబుతోంది. ఈ లీకేజీ జరిగిన సమయంలో వ్యాన్ మొత్తం ప్లాస్టిక్ తో నిండి ఉందని జీ న్యూస్ తెలిపింది.
ఏ మీడియా సంస్థ కూడా హ్యాండ్ శానిటైజర్ల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలపలేదు. ఈ ఘటన మే 21వ తేదీన జరగగా.. ఈ ఫోటోలు, వీడియోలు మే27 నుండి వైరల్ అవుతూ ఉన్నాయి. శానిటైజర్ల కారణంగా వ్యాన్ అలా మండిపోయింది అన్న వదంతులు కూడా నిజం కావు.
హ్యాండ్ శానిటైజర్లు మండే స్వభావం కలిగినవి.. ఎండకూ, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శానిటైజర్లు అన్నవి మండవు. దానికి నిప్పు తగిలితే తప్ప మండే అవకాశం లేదని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆర్టికల్ ను Full Fact లో చూడొచ్చు. ఆల్కాహాల్ తో తయారు చేసిన శానిటైజర్లు వాటికవే మండాలి అంటే 350 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రత ఉండాలి.
సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సిసిఎంబి), హైదరాబాద్ డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. హ్యాండ్ శానిటైజర్లు చాలా సురక్షితమైనవి. ఆల్కాహాల్ కంటెంట్ వాటిలో ఉండడం వలన చాలా తొందరగా ఆవిరి అయిపోతుంటాయి. నిమిషం కంటే ఎక్కువ ఉండదని అంటున్నారు. శానిటైజర్ ను పూసుకున్న వెంటనే నిప్పు దగ్గరకు వెలితే తప్పితే అంటుకునే ప్రమాదం లేదు. ఏదైనా వస్తువు ద్వారా నిప్పును డైరెక్ట్ గా శానిటైజర్ మీద వేస్తే తప్ప మండే అవకాశం లేదని తెలిపారు.
Social Media Hoax Slayer లో కూడా ఇది తప్పు వార్త ని స్పష్టం చేశారు.
ఢిల్లీ లోని రోహిణి ఫ్లై ఓవర్ పైన శానిటైజర్ల కారణంగా వాహనంలో మంటలు చెలరేగాయన్నది 'పచ్చి అబద్ధం'.